నల్గొండ నా ఊపిరి.. అభివృద్ధే నా ధ్యేయం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- నల్గొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కోమటిరెడ్డి
- తన శ్వాస ఉన్నంత వరకు జిల్లా ప్రజల కోసమే పనిచేస్తానన్న మంత్రి
- జిల్లాలో నీటి కష్టాలు తీర్చే బాధ్యతను తాను తీసుకుంటానని వ్యాఖ్య
నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో పయనింపజేసి, తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ నేల చూపిన త్యాగం, ఆత్మగౌరవం స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకలని అభివర్ణించారు. తన శ్వాస ఉన్నంత వరకు జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసమే పనిచేస్తానని చెప్పారు. జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 5.35 లక్షల మంది రైతులకు రూ. 715 కోట్ల రైతు భరోసా, 1.99 లక్షల మంది పింఛనుదారులకు రూ. 51.28 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే 17,873 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 4,360 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, 2.56 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
నల్గొండ పట్టణంలో 24 గంటల మంచినీటి సరఫరా లక్ష్యంతో రూ. 83 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమే కాకుండా, పట్టణాభివృద్ధి కోసం మరో రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రూ. 20 కోట్లతో ఎన్ఏసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అమరవీరుల త్యాగాల సాక్షిగా నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లోనూ ప్రథమ స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు.