భారత విశ్వగురు లక్ష్యానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి: మోహన్‌ భగవత్‌

Many forces are working against the aim of bharat vishwaguru says RSS Chief Mohan Bhagawat
  • భారత్‌ను విశ్వగురుగా నిలపాలని మోహన్‌ భగవత్‌ పిలుపు
  • స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతని వ్యాఖ్య
  • దేశ అభివృద్ధికి త్యాగం, క్రమశిక్షణ అవసరమని వెల్లడి
  • జాతీయ జెండా రంగు ప్రాధాన్యాన్ని వివరించిన భగవత్‌
  • భిన్నాభిప్రాయాల్లోనే భారత ఐక్యత ఉందని వ్యాఖ్య
భారత్‌ను సంతోషకరమైన, సంపన్నమైన, సురక్షితమైన దేశంగా తీర్చిదిద్ది విశ్వగురుగా నిలపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమని అన్నారు. స్వాతంత్య్రం కోసం 1857 నుంచి దాదాపు 90 ఏళ్ల పాటు ఎందరో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి పోరాట ఫలితంగా దేశానికి స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.

నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం భగవత్‌ మాట్లాడారు. భారత్‌ ప్రపంచానికి తన వంతు సహకారం అందించే స్థాయికి ఎదగాలని అన్నారు. అయితే ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా అనేక మంది, శక్తులు పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా దేశ సిద్ధాంతాలను వదులుకోకుండా వాటిని ఎదుర్కోవాలని సూచించారు. భారత్‌ను విశ్వగురుగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జాతీయ జెండాలోని మూడు రంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భగవత్‌ వివరించారు. కాషాయం కార్యాచరణ, జ్ఞానం, త్యాగానికి ప్రతీక అని చెప్పారు. స్వాతంత్య్రం కోసం కష్టపడి పోరాడిన త్యాగ గుణాలు.. దేశ అభివృద్ధికి కూడా అవసరమన్నారు. తెలుపు స్వచ్ఛత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఆకుపచ్చ రంగు సంపద, అభివృద్ధిని సూచిస్తుందని వివరించారు. త్యాగం, అంకితభావం, కష్టపడే తత్వం, జ్ఞానం ప్రజల జీవితాల్లో భాగమైతే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు.

దేశంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండొచ్చని.. ఆ వైవిధ్యమే ఐక్యతకు నిదర్శనమని భగవత్‌ అన్నారు. జాతీయ పతాకంలోని అశోక చక్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. చక్రంలో అనేక ఆకులు ఉన్నా అవన్నీ ఒకే కేంద్ర బిందువు నుంచి వెలువడతాయని చెప్పారు. వ్యక్తిగత, సామాజిక చైతన్యానికి అశోక చక్రం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ధర్మం, క్రమశిక్షణ పరిధిలోనే ఆ చక్రంలోని ఆకులు ఉన్నాయని వివరించారు.

భారత్‌ స్వతంత్ర దేశంగా కొనసాగడం మాత్రమే సరిపోదని భగవత్‌ అన్నారు. మానవాళికి ఉపయోగపడేలా దేశం తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ పతాకంలోని విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని సంతోషకరంగా, సంపన్నంగా, సురక్షితంగా మార్చడం ప్రతి భారతీయుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
Advertisement
RSS
Mohan Bhagawat
Vishwa Guru
Nagpur
Mohan Bhagwat

More Telugu News