నేను కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలో బయటి నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువయిందన్న రాజగోపాల్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో రేగిన దుమారం
- తాను పార్టీ నేతలను విమర్శించలేదన్న మునుగోడు ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ నడుస్తున్న వేళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, పార్టీని కానీ విమర్శించలేదని... విమర్శించబోనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని... భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కూడా ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రజాపాలనలో తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని ఆయన చెప్పారు. సీమాంధ్ర పాలకులు, కాంట్రాక్టర్ల చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం లేదా పార్టీ నడవకూడదని సూచించారు. ప్రజాపాలన అంటే కేవలం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసం కాదని... పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని స్పష్టం చేశారు.