22 కి.మీ. రోడ్డుకు రూ. 1,519 కోట్ల ఖర్చు చూపిస్తున్నారు: అంబటి రాంబాబు

Ambati Rambabu slams government for 1519 crore expense on 22 km road
  • అమరావతి పేరుతో భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అంబటి
  • తాత్కాలిక భవనాలు, స్టీల్ బ్రిడ్జిల పేరుతో వేల కోట్లు తగలేస్తున్నారని ఆరోపణ
  • కమీషన్ల కోసం అంచనాల బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారని విమర్శ

అమరావతి రాజధాని నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, అమరావతి అనేది అద్భుత నగరం ఎంతమాత్రం కాదని అన్నారు. అది కేవలం అవినీతి, దోపిడీకి నిలయంగా మారిందని విమర్శించారు.  


రాజధాని నిర్మాణాలు ఎప్పటికీ పూర్తి కావని... తాత్కాలిక భవనాలు, స్టీల్ బ్రిడ్జిల పేరుతో అప్పులు చేసి మరీ వేల కోట్ల రూపాయలు తగలేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ, 22 కిలోమీటర్ల రోడ్డుకు రూ. 1,519 కోట్ల ఖర్చు చూపిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కిలోమీటర్ రోడ్డుకు రూ. 180 కోట్లు ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సరైన న్యాయం జరగలేదని, కమీషన్ల కోసమే అంచనాల బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు.

Advertisement
Ambati Rambabu
Amaravati Capital City
Andhra Pradesh Roads
YSRCP
Amaravati Corruption
AP Infrastructure Budget

More Telugu News