సెప్టెంబరులో భారత్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌!

Iranian President Pezeshkian to visit India in September
  • బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశాలు
  • ఇటీవలే భారత్‌కు వచ్చిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి
  • పశ్చిమాసియా భద్రతలో భారత్‌ మరింత కీలక పాత్ర పోషించగలదని వ్యాఖ్య
  • ఈ నేపథ్యంలో పెజెష్కియాన్‌ భారత పర్యటనకు ప్రాధాన్యం
ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సెప్టెంబరులో భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ వెల్లడించింది. 2026లో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్‌.. 18వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత్‌ అధ్యక్షతన జరిగే ఈ సదస్సు ‘బిల్డింగ్‌ ఫర్‌ రెసిలియన్స్‌, ఇన్నోవేషన్‌, కోఆపరేషన్‌ అండ్‌ సస్టెయినబిలిటీ’ అనే అజెండాతో సాగనుంది. 2026 ఆరంభంలో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ నుంచి భారత్‌ స్వీకరించింది.

పెజెష్కియాన్‌ పర్యటనకు మరో ప్రాధాన్యం ఉంది. 2024 అక్టోబరులో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఇరాన్‌ 2024లో బ్రిక్స్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందింది. అదే సమయంలో ఈజిప్ట్‌, ఇథియోపియా, యూఏఈ కూడా కూటమిలో చేరాయి. 2025లో ఇండోనేషియా సభ్యత్వం పొందడంతో బ్రిక్స్‌ పూర్తిస్థాయి సభ్యుల సంఖ్య 11కి చేరింది.

ఇటీవలే ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ భారత్‌కు వచ్చారు. బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్‌ మరింత కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. అవసరమైతే భారత్‌ చేపట్టే నిర్మాణాత్మక ప్రయత్నాలను స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య భద్రతకు ఇరాన్‌ కట్టుబడి ఉంటుందని అరాఘ్చీ తెలిపారు. సైనిక పరిష్కారం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే మార్గమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్‌ భారత్‌ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
Advertisement
Masoud Pezeshkian
BRICS Summit Delhi
India Iran relations
Narendra Modi
Abbas Araghchi
West Asia stability

More Telugu News