ఐదేళ్లలో ఉద్యోగాలివ్వని జగన్.. ఇప్పుడు డీఎస్సీపై లేనిపోని డ్రామాలు: యరపతినేని శ్రీనివాసరావు
- ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న యరపతినేని
- డీఎస్సీ అక్రమాల పేరుతో నిత్యం డ్రామాలు ఆడుతున్నారని మండిపాటు
- 11 సీట్లకు పరిమితమైనా ఇంకా మార్పు రాలేదని ఎద్దేవా
ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ వేయని వైసీపీ నేతలు ఇప్పుడు డీఎస్సీ అక్రమాల పేరుతో నిత్యం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రజా సమస్యలపై నిజంగా గౌరవం, ధైర్యం ఉంటే సభకు దూరంగా ఉండటం మాని వెంటనే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషం చిమ్ముతోందని యరపతినేని మండిపడ్డారు. ఎంపికైన డీఎస్సీ విజేతలు స్వయంగా వచ్చి నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా జరిగిందని చెబుతున్నా ప్రతి విషయాన్ని చెడుగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నాయకత్వంలో ఇంకా మార్పు రాకపోవడం విచారకరమన్నారు. నిత్యం శవ రాజకీయాలు చేస్తూ పరామర్శల పేరుతో వ్యవస్థలను, పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ హయాంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన వైసీపీ నేతలు, కూటమి ప్రభుత్వంపై అలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
దళిత వర్గానికి చెందిన మహిళా హోం మంత్రిని అవమానించడం రాజకీయ సంస్కారానికే మచ్చ అని అన్నారు. నంద్యాలలో నాడు చంద్రబాబును కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన చరిత్ర ఉన్న జగన్, ఇప్పుడు తమ పార్టీ నేత విరూపాక్షికి నోటీసులు ఇవ్వాలని చెప్పడం ఆయన ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి పోకడలు పోతున్న వైసీపీ త్వరలోనే రాజకీయాల నుంచి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని యరపతినేని వ్యాఖ్యానించారు.