నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను రెండుసార్లు తీశాం: కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్
- కర్నూలు జిల్లా జైల్లో విరూపాక్షిని కలిసిన జగన్
- జైలు అధికారులు తన పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారన్న జగన్
- మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదన్న జైలు సూపరింటెండెంట్
వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో వైసీపీ అధినేత జగన్ నిన్న ములాఖత్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తన పట్ల జైలు అధికారులు అగౌరవంగా వ్యవహరించారని జగన్ అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, జగన్ చేసిన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. జైలు నిబంధనలు, ‘ఈ-ప్రిజన్స్’ సాఫ్ట్‌వేర్ ప్రక్రియకు అనుగుణంగానే జగన్ ఫొటోను తీసుకుని ములాఖత్‌కు అనుమతించామని ఆయన స్పష్టం చేశారు.
ములాఖత్ సమయంలో ఎలాంటి అమర్యాదకరమైన వాతావరణం నెలకొనలేదని, మాజీ సీఎం హోదాకు భంగం కలిగించేలా ఏ అధికారిగానీ, సిబ్బందిగానీ ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములను కలిసేందుకు జగన్ కోరారని, ఈ-ప్రిజన్స్ సాఫ్ట్‌వేర్ నియమాల ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలవాల్సి వస్తే అంతమందికీ ప్రత్యేకంగా ఫొటో తీసుకోవాల్సి ఉన్నందున మాజీ సీఎం ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు.