‘భోగి’లో శర్వానంద్‌ మాస్ యాక్షన్‌.. మరో భారీ షెడ్యూల్‌ పూర్తి!

Sharwanand Action Mass in Bhogi Another Massive Schedule Completed
  • క్లైమాక్స్‌ తర్వాత 2 వారాల్లోనే కొత్త షెడ్యూల్‌ ముగింపు
  • 22 రోజుల పాటు సాగిన క్లైమాక్స్‌ షూటింగ్‌ 
  • క్లైమాక్స్‌లో 800 మందికిపైగా జూనియర్‌ ఆర్టిస్టులు
  • ‘గంగ’ పాత్రలో శర్వానంద్‌ ప్రత్యేక గెటప్‌
  • ఆగస్టు 28న ఐదు భాషల్లో ‘భోగి’ విడుదల
శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తాజాగా మరో భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ను చిత్రబృందం పూర్తి చేసింది. క్లైమాక్స్‌ షెడ్యూల్‌ ముగించిన రెండు వారాల్లోపే మరో షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేయడం విశేషం.

షూటింగ్‌ పూర్తయిన విషయాన్ని దర్శకుడు సంపత్‌ నంది ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ప్రతి ఫ్రేమ్‌లో శర్వానంద్‌ కష్టం కనిపిస్తోందని ప్రశంసించారు. సినిమా మరింత భారీగా, కఠినంగా, ఆసక్తికరంగా మారుతోందని తెలిపారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌, సినిమాటోగ్రాఫర్‌ కిశోర్‌కుమార్‌, చిత్రబృందానికి కృతజ్ఞతలు చెప్పారు.

‘భోగి’ క్లైమాక్స్‌ షూటింగ్‌ను జులైలో 22 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించారు. ఇందుకోసం దాదాపు మూడు నెలల పాటు సన్నాహాలు చేశారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ కిరణ్‌కుమార్‌ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్‌లో 800 మందికిపైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

ఈ సినిమాలో శర్వానంద్‌ ‘గంగ’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. పాత్ర కోసం ఆయన రోజూ రెండున్నర గంటలకు పైగా మేకప్‌ వేసుకునేవారని చిత్రవర్గాలు తెలిపాయి. షూటింగ్‌ పూర్తయ్యాక ఆ మేకప్‌ను తొలగించేందుకు మరో గంట సమయం పట్టేదని పేర్కొన్నాయి. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో శర్వా నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నాయి.

అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. అనుపమ ‘కందుల సులోచన రాణి’, డింపుల్‌ ‘మందారం’ పాత్రల్లో కనిపించనున్నారు. 1960ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Advertisement
Sharwanand
Bhogi Movie
Sampath Nandi
Anupama Parameswaran
Periodic Action Drama
Telugu Cinema News

More Telugu News