ప్రజలకు అందుబాటులోకి సనత్‌నగర్ ‘టిమ్స్’.. 17న ప్రారంభించనున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy to inaugurate Sanathnagar TIMS hospital on June 17
  • రూ.1,070 కోట్ల వ్యయంతో 1,082 పడకలతో నిర్మాణం
  • మొదట 582 పడకలతో సేవలు
  • అక్టోబర్‌కు పూర్తిస్థాయిలో అందుబాటు
  • నిమ్స్ తరహాలో స్వయంప్రతిపత్తి హోదాతో కార్యకలాపాలు
నగర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మించిన సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,070 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించారు. మొత్తం 1082 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో తొలిదశలో 582 పడకలతో సేవలను ప్రారంభించనున్నారు. మిగిలిన 500 పడకలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే మే నెల నుంచి ఓపీ విభాగంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా, రోజూ 200 నుంచి 250 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు.

ఈ ఆసుపత్రి ప్రధానంగా నాలుగు కీలక విభాగాలకు కేంద్రంగా నిలవనుంది. కార్డియాక్ (గుండె సంబంధిత), నెఫ్రాలజీ-యూరాలజీ (మూత్రపిండాల సంబంధిత), అవయవ మార్పిడి, ట్రామా విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. వీటికి అనుబంధంగా మరో 37 విభాగాలు పనిచేస్తాయి. ఈ ఆస్పత్రికి నిమ్స్ తరహాలోనే స్వయంప్రతిపత్తి హోదా కల్పించారు. దీంతో నిధులను సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, తొలి ఐదారేళ్ల పాటు ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.

వాస్తవానికి, గత ఏడాది డిసెంబర్‌లో, ఆ తర్వాత ఉగాదికి ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని భావించినా, పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని పనులు పూర్తికావడంతో ప్రభుత్వం దీనిని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
Advertisement
Revanth Reddy
Sanathnagar TIMS
Telangana Institute of Medical Sciences
Hyderabad Super Specialty Hospital
Telangana Health Infrastructure
MCR TIMS Sanathnagar

More Telugu News