కాళేశ్వరం, యూనిటీ మాల్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలి: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రఘునందన్ రావు ధ్వజం
- కాళేశ్వరం అక్రమాలపై డీపీఆర్ నుంచి విచారణ జరిపించాలన్న రఘునందన్ రావు
- కాంగ్రెస్ తప్పులపై కూడా విచారణ జరపాలని డిమాండ్
- ప్రజలను దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేవలం మూడు బ్యారేజీలకు మాత్రమే పరిమితం కాకుండా, డీపీఆర్ తయారీ నుంచి ముగింపు చెల్లింపుల వరకు సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లేఖ రాయాలని, తానే స్వయంగా కేంద్ర హోంమంత్రిని కలిసి విచారణ ముందుకు సాగేలా కృషి చేస్తానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 202 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమితో చేపట్టనున్న ‘యూనిటీ మాల్’ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా విచారణ జరగాలని రఘునందన్ రావు అన్నారు. గతంలో కేటీఆర్ తప్పు చేస్తే విచారణ జరిపినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ తప్పులపైనా దర్యాప్తు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన 10 ఎకరాల భూకేటాయింపుతో పాటు ప్రస్తుత యూనిటీ మాల్ ఒప్పందంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లో ఎకరం భూమి విలువ వందల కోట్లకు చేరిందని, ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వాలకు లేదని, అవి కేవలం కస్టోడియన్లుగా మాత్రమే ఉండాలని ఎంపీ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని, అవినీతిలో ఈ రెండూ ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్న అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రింగ్ రోడ్డు, ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం వంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మారుస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించిన ఆయన, ఈ దోపిడీకి ముగింపు పలకాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు.