చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జ్‌కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి: సీఎం రేవంత్‌ రెడ్డికి వీహెచ్ లేఖ

Name Chanchalguda Steel Bridge after Sangam Laxmibai VH writes to CM Revanth Reddy
  • చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు కొత్త స్టీల్ బ్రిడ్జ్
  • సంగం లక్ష్మీబాయి సేవలు చరిత్రలో మరుపురానివన్న వీహెచ్
  • మూడుసార్లు ఎంపీగా గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారని కితాబు 

హైదరాబాద్ నగర పరిధిలోని చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌కు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, విద్యావేత్త సంగం లక్ష్మీబాయి పేరుతో నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాశారు.


భారత స్వాతంత్య్ర పోరాటంలో, ఆ తర్వాత సమాజ సేవలో సంగం లక్ష్మీబాయి అందించిన నిరుపమాన సేవలు చరిత్రలో మరపురానివని వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నేలకు చెందిన వీరనారిగా, నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు.


స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అల్వాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప విద్యామంత్రిగా సేవలు అందించారని, మెదక్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారని వివరించారు. సైదాబాద్‌లో 'ఇందిరా సేవా సదన్' నెలకొల్పి వేలాది మంది పేద బాలికలకు ఆశ్రయం, విద్య అందించిన మహోన్నత వ్యక్తి ఆమె అని తెలిపారు.  


ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నందున, గతంలో విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన సంగం లక్ష్మీబాయి పేరును చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ బ్రిడ్జ్‌కు నామకరణం చేస్తే ప్రజామోదం లభించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వీహెచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరారు.

Advertisement
Sangam Laxmibai
V Hanumantha Rao
Revanth Reddy
Chanchalguda Steel Bridge
Hyderabad Infrastructure
Telangana Government

More Telugu News