శ్రీరామకుంట వైకుంఠధామాన్ని ఆహ్లాదకరమైన పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నాం: హరీశ్ రావు
- సిద్దిపేట శ్రీరామకుంట వైకుంఠధామం పనులను పర్యవేక్షించిన హరీశ్
- పనులు జరగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
సిద్ధిపేట శ్రీరామకుంట వైకుంఠధామాన్ని సరికొత్త రీతిలో ఒక ఆహ్లాదకరమైన పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని శ్రీరామకుంట శ్మశానవాటికలో సాగుతున్న సుందరీకరణ పనులను ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన... మిగిలిన పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శ్మశానవాటిక ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా మరిన్ని మొక్కలు నాటాలని హరీశ్ సూచించారు. ప్రజల రాకపోకలకు వీలుగా సీసీ రోడ్లు, భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో దహన సంస్కారాల కోసం వచ్చే ప్రజలు వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా... వెంటనే సరైన లైటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. వీటితో పాటు టాయిలెట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి శుభ్రత ఉండేలా చూడాలన్నారు. పర్యావరణహిత పద్ధతిలో బయోగ్యాస్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించేలా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.