ముందు భారత్‌కు తిరిగి రండి.. ఆ తర్వాతే పిటిషన్ విచారిస్తాం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు స్పష్టీకరణ
- విదేశాల్లో ఉంటూ క్రిమినల్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరన్న బాంబే హైకోర్టు
- ఇండియాకు తిరిగొస్తే సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడి
- ఎప్పుడు తిరిగొస్తారో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశం
పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తే తప్ప... ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం’ చట్టబద్ధతను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని ధర్మాసనం తెగేసి చెప్పింది.
దేశం దాటి విదేశాల్లో తలదాచుకుంటూ, భారతీయ న్యాయస్థానాల పరిధికి లొంగకుండా క్రిమినల్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని కోర్టు వ్యాఖ్యానించింది. విజయ్ మాల్యా వేసిన రెండు వేర్వేరు పిటిషన్లను ఒకేసారి విచారించలేమని, విదేశాల్లో ఉంటూ రాజ్యాంగబద్ధతను సవాలు చేసే పిటిషన్‌ను కొనసాగించలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్‌కు తిరిగి వస్తే సమస్యకు పరిష్కారం చూపుతామని సూచిస్తూ, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో సమయపాలనతో కూడిన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... పరారీలో ఉన్న నేరస్థులు విచారణకు సహకరించకుండా కోర్టులను ఆశ్రయించకుండా ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం’ చట్టంలోని సెక్షన్ 14 అడ్డుకుంటుందని తెలిపారు. బ్రిటన్‌లో మాల్యా అప్పగింత ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుందని, ఇలాంటి పిటిషన్లతో ఆ ప్రక్రియకు ఆటంకం కలగకూడదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో, పిటిషన్ వెనక్కి తీసుకుంటారా? లేదా భారత్‌కు తిరిగొచ్చే తేదీని ఖరారు చేస్తారా? అని ప్రశ్నిస్తూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.