చికెన్‌-65కి ఆ పేరెలా వచ్చింది? అసలు కథ ఇదే..!

Chicken 65 History and the real story behind its name
  • మాంసాహారులకు ఇష్టమైన వంటకాల్లో చికెన్‌65 ఒకటి
  • ఆ పేరు వెనక ఆసక్తికరమైన కథ
  • 1965లో తొలిసారి తయారైన నేపథ్యంలోనే ఆ పేరు
  • చెన్నైలోని బుహారీ హోటల్‌ తొలిసారి తయారు చేసింది
  • ఆ పేరు వెనక వ్యాప్తిలో అనేక వదంతులు
చికెన్‌-65 అంటే తెలియని నాన్‌వెజ్‌ ప్రియులు ఉండరేమో. కరకరలాడే చికెన్‌, కారం మసాలా రుచితో దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయిన ఈ వంటకం పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ‘65’ ఎందుకు వచ్చిందో తెలుసా?

చికెన్‌-65ను 1965లో చెన్నైలోని బుహారీ హోటల్‌లో తొలిసారిగా తయారు చేసినట్లు చెబుతారు. హోటల్‌ వ్యవస్థాపకుడు ఏఎం బుహారీ ఈ వంటకాన్ని రూపొందించినట్లు సమాచారం. కస్టమర్ల కోసం స్నాక్‌గా తయారు చేసిన ఈ చికెన్‌ ముక్కలు త్వరగానే పాపులర్‌ అయ్యాయి. అప్పట్లో స్థానిక రుచికి తగ్గట్టుగా చికెన్‌ను మసాలాలు అద్ది కరకరలాడేలా వేయించేవారు.

ఇక ఈ వంటకం పేరులోని ‘65’కు కారణం కూడా ఇదేనని చెబుతారు. 1965లో తయారైన వంటకం కావడంతో దానికి ‘చికెన్‌-65’ అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఈ వంటకం తయారీ విధానంలో మార్పులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో స్థానిక మసాలాలు, ఇతర పదార్థాలను జోడిస్తూ తమదైన శైలిలో చికెన్‌-65ను తయారు చేస్తున్నారు.

అయితే ఈ పేరు రావడం వెనక ఇదే కారణమంటూ అనే వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. సరిగ్గా 65 రోజులు పెరిగిన కోళ్లతో తయారు చేస్తారనేది ఒక వాదన. అలాగే 65 ముక్కలు ఉంటాయని అందుకే చికెన్‌-65 అంటారనే ప్రచారమూ ఉంది. మరోవైపు కిలో చికెన్‌కు 65 మిరపకాయలు వాడతారని అందుకే ఆ పేరొచ్చిందనే వదంతీ వ్యాప్తిలో ఉంది. మరోవైపు సైనికులకు ఇచ్చే మెనూలో 65వ నంబర్‌లో ఈ చికెన్‌ ఉండేదని.. అందుకే చికెన్‌-65 అని పిలుస్తారని మరికొందరు చెబుతుంటారు. కానీ, ఇవన్నీ ఉత్తి వదంతులే. కేవలం 1965లో తయారైన కారణంగానే ఆ పేరొచ్చిందని హోటల్‌ రికార్డులు చెబుతున్నాయి. దీని స్ఫూర్తిగా తర్వాత చికెన్‌-78, చికెన్‌-82, చికెన్‌-90 కూడా వచ్చాయి.

ఇంట్లోనూ చికెన్‌-65ను సులభంగా తయారు చేసుకోవచ్చు. బోన్‌లెస్‌ చికెన్‌కు అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు కలిపి మ్యారినేట్‌ చేయాలి. అనంతరం నూనెలో కరకరలాడేలా వేయిస్తే చికెన్‌-65 సిద్ధం. కరివేపాకు జోడిస్తే రుచి మరింత పెరుగుతుంది. చెన్నైలోని బుహారీ హోటల్‌ చైన్‌లో ఇప్పటికీ ఒరిజినల్ స్టైల్‌ చికెన్‌-65 లభిస్తోంది.
Advertisement
Chicken 65
Buhari Hotel Chennai
AM Buhari
Chicken 65 Origin
Indian Fried Chicken
South Indian Cuisine

More Telugu News