సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్, ఐదుగురి మృతి

Sangareddy District Tragic Accident Tanker Hits Auto Five Dead
  • జహీరాబాద్‌లో ఆటోను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
  • మృతులు కర్ణాటకకు చెందిన కూలీలుగా గుర్తింపు
  • ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోని యూ-టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఉపాధి నిమిత్తం జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూలి పనుల కోసం హుమ్నాబాద్ నుంచి వచ్చినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉండగా, హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Sangareddy
Zaheerabad Road Accident
Oil Tanker Auto Collision
Telangana Road Mishap
Revanth Reddy
Bidar Laborers Death

More Telugu News