ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీఐడీకి అప్పగించాలి: డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ

Uday Krishna Reddy case should be handed over to CID Former CBI Director Nageswara Rao letter to DGP
  • ఈ కేసులో సజ్జనార్ జోక్యం చేసుకుంటున్నాారన్న నాగేశ్వరరావు
  • ఉదయ్ కృష్ణారెడ్డిని సజ్జనార్ ఎన్‌కౌంటర్ చేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడి
  • ఈ కేసుపై పోలీసులు అసాధారణ ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్య

హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును వెంటనే సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 


అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా జోక్యం చేసుకోవడంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ ద్వారా 4 పేజీల లేఖ పంపినట్లు ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. కస్టోడియల్ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డిని సజ్జనార్ ఎన్‌కౌంటర్ చేస్తానంటూ బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.


మణిపూర్ క్యాడర్‌కు చెందిన సదరు మహిళా ఐపీఎస్ అధికారిణికి, 2025 బ్యాచ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సోషల్ మీడియా ద్వారా పరిచయమై వ్యక్తిగత సంబంధంగా మారిందని, ఇది విఫలమైన వ్యక్తిగత బంధం నుంచి పుట్టుకొచ్చిన కేసని నాగేశ్వరరావు తెలిపారు. పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే, ఎలాంటి ఆధారాలు నాశనం చేయకపోయినా పోలీసులు తొందరపడి ఉదయ్‌ను అరెస్ట్ చేశారని విమర్శించారు. 


మొదట ఇచ్చిన ఫిర్యాదులో లేని అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లను రిమాండ్ నివేదికలో హడావుడిగా ఎందుకు చేర్చారో తేలాల్సి ఉందన్నారు. ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్య కేసులో నిందితులను పట్టుకోని పోలీసులు... పర్యవేక్షణాధికారి కాని సజ్జనార్ నాయకత్వంలో ఈ కేసుపై అసాధారణ ఆసక్తి చూపడం, సీసీటీవీలు లేని చోట విచారించి ఎన్‌కౌంటర్ బెదిరింపులకు దిగడంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డీజీపీని కోరారు.

Advertisement
Uday Krishna Reddy
M Nageswara Rao
CV Anand
CP Sajjanar
Trainee IPS Case
CID Investigation

More Telugu News