హైదరాబాద్‌లో ఎస్‌యూవీ బీభత్సం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి

SUV Rampage in Hyderabad Retired Army Employee Dead
  • హైదరాబాద్ శివార్లలో ఎస్‌యూవీ కారు బీభత్సం
  • రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు
  • కారును వదిలేసి పరారైన నలుగురు యువకులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంపీ స్కూల్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ మహీంద్రా ఎస్‌యూవీ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. అతివేగంగా వచ్చిన ఎస్‌యూవీ తొలుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అనంతరం అదుపుతప్పిన అదే వాహనం రాపిడో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి కాలు విరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం శంషాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాద సమయంలో కారు మితిమీరిన వేగంతో ఉందని, వాహనం నడిపిన వారు మద్యం మత్తులో ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.                                
Advertisement
Hyderabad Road Accident
Narsingi SUV Crash
Retired Army Employee Death
Hyder Shah Kote
Mahindra SUV Accident
Narsingi Police

More Telugu News