ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీకి పితృవియోగం.. తండ్రి జార్జ్ కన్నుమూత

Lionel Messi father Jorge Messi passes away
  • అర్జెంటీనాలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
  • మెస్సీ కెరీర్‌లో ఏజెంట్‌గా వ్యవహరించిన తండ్రి జార్జ్
  • కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్
  • 2026 వరల్డ్ కప్ సమయంలోనే ఆయన ఆరోగ్యంపై వదంతులు
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (68) కన్నుమూశారు. అర్జెంటీనాలోని రొసారియో పట్టణంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్ మెస్సీ, తన కుమారుడు లియోనెల్ క్రీడా ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషించారు. తనయుడికి ఏజెంట్ గా వ్యవహరించారు. చిన్నతనంలోనే లియోనెల్‌లోని అసాధారణ ప్రతిభను గుర్తించి, అతడిని బార్సిలోనా క్లబ్‌కు తీసుకెళ్లడం నుంచి ప్రొఫెషనల్, వాణిజ్యపరమైన ఒప్పందాల వరకు అన్ని వ్యవహారాల్లోనూ జార్జ్ మెస్సీ వెన్నంటే నిలిచారు.

ఇటీవల ముగిసిన 2026 ఫిఫా ప్రపంచ కప్ సమయంలో జార్జ్ మెస్సీ ఆరోగ్యంపై వివిధ రకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ తరుణంలో మెస్సీ కుటుంబం స్పందిస్తూ, ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని మీడియాను కోరింది.

ఆ టోర్నమెంట్‌ సమయంలో తాను వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్లే పలు సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యానని లియోనెల్ మెస్సీ స్వయంగా వెల్లడించారు. జార్జ్ మెస్సీకి భార్య సెలియా కుకిటిని, కుమారులు లియోనెల్, రోడ్రిగో, మతియాస్, కుమార్తె మరియా సోల్ సహా మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
Advertisement
Lionel Messi
Jorge Messi
Jorge Messi Death
Lionel Messi Father
Argentina Football News
Jorge Messi Agent

More Telugu News