'అద్దెకు బాయ్‌ఫ్రెండ్' మోసం.. యువతులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar warns women about rented boyfriend scam
  • సోషల్ మీడియాలో 'అద్దెకు బాయ్‌ఫ్రెండ్' ప్రకటనలపై సజ్జనార్ హెచ్చరిక
  • యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త సైబర్ మోసం
  • ఆకర్షణీయమైన ప్యాకేజీలు చూపి అడ్వాన్స్ డబ్బులు వసూలు
  • డబ్బులు తీసుకున్న తర్వాత అకౌంట్లను బ్లాక్ చేస్తున్న కేటుగాళ్లు
  • అపరిచితులను కలవడం, వివరాలు పంచుకోవడం ప్రమాదకరమని సూచన
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 'రెంట్ బాయ్‌ఫ్రెండ్' (అద్దెకు బాయ్‌ఫ్రెండ్) ప్రకటనల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మోసపూరిత వ్యవహారానికి సంబంధించిన వివరాలను తన 'ఎక్స్' ఖాతా ద్వారా సజ్జనార్ వెల్లడించారు.

గంటపాటు కాఫీ మీటింగ్ కోసం రూ. 499, సినిమా డేట్ కోసం రూ. 1,249, షాపింగ్ కోసం రూ. 1,499, వివాహాలు, ఇతర శుభకార్యాలకు తోడుగా వచ్చేందుకు రూ. 1,999, రోజంతా అందుబాటులో ఉండేందుకు రూ. 4,499 అంటూ ఆకర్షణీయమైన ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ నుంచి సేకరించిన లేదా 'ఏఐ' సాంకేతికతతో సృష్టించిన అందమైన యువకుల ఫోటోలను వాడుతూ, గోప్యత పాటిస్తామని నమ్మబలుకుతున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రకటనలను నమ్మి ఎవరైనా సంప్రదిస్తే, వారితో స్నేహంగా మాట్లాడి తొలుత అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని డిమాండ్ చేస్తారని వివరించారు. డిజిటల్ వ్యాలెట్లు లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా నగదు బదిలీ చేయించుకున్న వెంటనే బాధితుల ఖాతాలను బ్లాక్ చేస్తారని తెలిపారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పరిచయమైన వారిని నేరుగా కలిస్తే, వారి నుంచి బ్లాక్‌మెయిల్, బెదిరింపులు లేదా ఇతర భద్రతాపరమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

ఇలాంటి ఆఫర్లకు స్పందించవద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తుగా నగదు చెల్లించవద్దని సజ్జనార్ సూచించారు. తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ఎవరైనా ఈ మోసానికి గురైనా లేదా ఇటువంటి అనుమానాస్పద పోస్టులు గమనించినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ప్రకటనలపై సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.
Advertisement
VC Sajjanar
Rented boyfriend scam
Hyderabad cyber crime
Social media fraud
Online dating scam

More Telugu News