దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం: కేసీఆర్ నిర్ణయం
- ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పెద్ది సుదర్శన్ రెడ్డి
- కుటుంబానికి అండగా నిలిచేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం
- పిల్లల చదువు, ఆయన తల్లి బాగోగుల కోసం ఆర్థిక సాయం
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మొత్తంగా రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం అందించనుండగా, వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ. 25 లక్షలను బ్యాంకులో జమ చేయనున్నారు.
పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జిల్లా ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన చర్యలను అమలు అమలు చేస్తారని కేసీఆర్ తెలిపారు