ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు.. కాల్వలు తవ్వకుండానే అంకితమిచ్చారు: జూపల్లి
- రాజకీయాల కోసం ప్రాజెక్టుల అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తోందన్న జూపల్లి
- పాలమూరు ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ
- పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకుండానే జాతికి అంకితం చేశారని మండిపాటు
తెలంగాణ తాగు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే కనీస అర్హత కూడా బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. జూరాలలో ఉన్న ప్రసుత నీటిమట్టంతో మొత్తం ఆయకట్టుకు నీరు అందించడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. రూ.80 వేల కోట్లు పట్టే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, కనీసం కాల్వలు కూడా తవ్వకుండానే జాతికి అంకితం ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 68.5 శాతం వాటా రావాల్సి ఉండగా... కేసీఆర్ హయాంలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు మాత్రమే కేటాయింపులు జరగ్గా... ఏపీకి 512 టీఎంసీలు దక్కేలా చేశారని మంత్రి మండిపడ్డారు.