రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా 'జై తెలంగాణ' అనలేదు: హరీశ్ రావు

Revanth Reddy never said Jai Telangana even once says Harish Rao
  • తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న హరీశ్
  • కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్య
  • గోదావరి జలాల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపాటు

సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట ప్రాంతంతో జయశంకర్ కు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్న ఆయన... కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం వల్లే తెలంగాణ కల సాకారమైందని వ్యాఖ్యానించారు. నాడు ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని... రేవంత్ ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అని అనలేదని విమర్శించారు.


గోదావరి నదీ జలాల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 380 టీఎంసీల నీటిని హక్కుగా సాధిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క ప్రాజెక్టుకూ అనుమతి తీసుకురాకపోగా సాధించుకున్న అనుమతులను కూడా రద్దు చేసేలా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) అజెండా రూపొందుతోందని మండిపడ్డారు. 


దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టులను పునఃసమీక్షించి రద్దు చేయాలనే అంశం అజెండాలోకి రావడం దుర్మార్గమన్నారు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుతో పాటు సమ్మక్క-సారక్క ప్రాజెక్టు 47 టీఎంసీల క్లియరెన్స్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏపీ సర్కార్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జీఆర్ఎంబీ అజెండాను మార్పించాలని, లేని పక్షంలో ఆ సమావేశాన్ని తక్షణమే బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Harish Rao
Revanth Reddy
Telangana Congress Government
Godavari River Management Board
Siddipet
Jayashankar Sir

More Telugu News