చంచల్‌గూడ జైలు నుంచి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి విచారణ

Uday Krishna Reddy moved from Chanchalguda Jail to Attapur Police Station for investigation
  • సహచర ట్రైనీ ఆఫీసర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణ రెడ్డి అరెస్ట్
  • రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం
  • చంచల్‌గూడ జైలు నుంచి విచారణ కోసం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • మరో మహిళతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెలుగుచూసిన కొత్త ఆధారాలు
  • భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణ రెడ్డిని నేడు హైదరాబాద్ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లావణ్య నాయక్ నేతృత్వంలోని బృందం ఉదయ్ కృష్ణ రెడ్డిని విచారిస్తోంది. రేపు కూడా ఈ విచారణ కొన‌సాగ‌నుంది. ఈ కస్టడీ విచారణలో కేసుకి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. జులై 29న అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో ఉంటున్నాడు.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా అధికారిణి జూలై 18న ఉదయ్ కృష్ణ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2025 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉదయ్ కృష్ణ రెడ్డి, గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. బాధితురాలితో అతనికి 2025 మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ), ఎస్‌వీపీఎన్‌పీఏలో శిక్షణ సమయంలో వారి మధ్య సంబంధం కొనసాగింది. అయితే, తరచూ గొడవలు, భావోద్వేగ బ్లాక్‌మెయిలింగ్, అనుమానం వంటివి చోటుచేసుకున్నాయి.

కొంతకాలం తర్వాత బాధితురాలు అతనితో సంబంధాన్ని తెంచుకుని మరొకరిని వివాహం చేసుకోవడంతో ఉదయ్ కృష్ణ రెడ్డి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తమ వ్యక్తిగత చాట్‌లను బయటపెడతానని బెదిరించాడు. ఆత్మహత్య చేసుకుంటానని, ఆయుధాలు చూపించి భయపెట్టడం, ఆమె ల్యాప్‌టాప్‌ను పగలగొట్టడం, సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా, నిందితుడికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కొత్త ఆధారాలు సేకరించారు. ఈ రెండు రోజుల విచారణలో ఈ కొత్త కోణంపై పోలీసులు మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
Advertisement
Uday Krishna Reddy
Trainee IPS harassment case
Attapur Police Station investigation
Hyderabad Women Safety Wing
SVPNPA trainee officer arrest
Chanchalguda Jail custody

More Telugu News