త్వరలో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. ఢిల్లీ నుంచి తొలిసారి మీడియా ముందుకు!
- ఇండియాలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
- భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వస్తున్న బంగ్లా మాజీ ప్రధాని
- భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టతను ఇచ్చే అవకాశం
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వేదికగా నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో ఆమె వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న విద్యార్థుల తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోయి భారత్‌కు వచ్చిన తర్వాత ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వస్తుండటం తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఈ భేటీలో ఆమె బంగ్లాదేశ్ తిరుగు ప్రయాణం, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్‌తో పాటు అవామీ లీగ్ ముఖ్య నేతలు పాలుపంచుకోనున్నారు. అయితే, ఈ సమావేశంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇదొక ప్రైవేటు కార్యక్రమం అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు, ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. భారత్‌తో ఉన్న మైత్రీ సంబంధాలు దెబ్బతినడం తమకు ఇష్టం లేదని, హసీనాతో పాటు అవామీ లీగ్ నేతలు భారత్ నేల పైనుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై తమ ఆందోళనలను ఇప్పటికే భారత్ కు తెలియజేశామని బంగ్లా విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ తెలిపారు. దీనిని భారత్ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, షేక్ హసీనాకు సంబంధించిన ఎలాంటి ప్రసంగాలు, ఆడియో, వీడియో ఇంటర్వ్యూలను ప్రసారం చేయకూడదని తమ దేశీయ మీడియా సంస్థలపై బంగ్లా ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. నిబంధనలు దాటితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.