సీఎం విజయ్‌ తొలి బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీట.. పాఠశాల విద్యకే రూ.44,527 కోట్లు

Vijay First Budget Allocates 44527 Crore for School Education
  • కామరాజర్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు
  • 10 వేల పాఠశాలల్లో సూపర్ క్లీన్ క్యాంపస్ పథకం
  • కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కోసం రూ.2,000 కోట్లు
  • సంక్షేమ పథకాలకు భారీ నిధుల కేటాయింపు
  • అదనంగా రూ.16 వేల కోట్ల ఆదాయం రాబట్టడమే లక్ష్యం
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ.44,527 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ఎన్.మారీ విల్సన్ ప్రకటించారు.

9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ‘పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్’ పేరుతో ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యతో పాటు భోజనం, వసతి, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తారు. ఈ పథకానికి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.125 కోట్లు కేటాయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు ‘సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్’ పథకం కింద రూ.129 కోట్లు కేటాయించారు. తొలి దశలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు.

ఉన్నత విద్యనభ్యసించేవాళ్లకు ‘వెట్రి ల్యాప్‌టాప్ పథకం’ కింద ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు రూ.2,000 కోట్లు కేటాయించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే అవగాహన కార్యక్రమాలకు రూ.7 కోట్లు కేటాయించారు.

సంక్షేమ పథకాలకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి రూ.560 కోట్లు కేటాయించింది. పెళ్లి రోజు వధువుకు ఎనిమిది గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించే పథకానికి రూ.812 కోట్లు ప్రతిపాదించింది.

రాష్ట్ర అప్పులు గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయని మంత్రి తెలిపారు. అదనంగా రూ.16 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement
Vijay
TVK Budget 2026 27
Tamil Nadu School Education Budget
Vetri Laptop Scheme
Perunthalaivar Kamarajar Model Schools
N Mari Wilson

More Telugu News