కలలకు రెక్కలు... చిన్నారుల కోసం మొత్తం విమానాన్నే బుక్ చేసిన యూట్యూబర్

Sourav Joshi surprises underprivileged kids by booking a full Indigo flight
  • పేద చిన్నారుల కోసం మొత్తం విమానాన్నే బుక్ చేసిన సౌరవ్ జోషి
  • చాలామందికి అదే తొలి విమాన ప్రయాణం
  • టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పిల్లలకు ధైర్యం చెప్పిన దంపతులు
  • నోయిడాలో భోజనం, గేమ్స్‌తో చిన్నారులకు ప్రత్యేక రోజు
  • చివరికి ప్రతి చిన్నారిని ఇంటి వద్ద దింపిన జోషి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
విమానంలో ప్రయాణించాలని చాలా మంది చిన్నారులు కలలు కంటారు. కానీ చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి పిల్లల కోసం ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన పని ఇప్పుడు వేలాది మంది మనసులను తాకుతోంది. విమానం ఎక్కే అవకాశం లేని చిన్నారులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించాడు. వారి ముఖాల్లో కనిపించిన ఆనందం సోషల్ మీడియాలోనూ హృదయాలను కదిలిస్తోంది.

యూట్యూబర్ సౌరవ్ జోషి ఆర్థికంగా వెనకబడిన పాఠశాల చిన్నారుల కోసం ఇండిగో విమానాన్ని పూర్తిగా బుక్ చేశారు. వారిలో చాలామందికి ఇదే తొలి విమాన ప్రయాణం. ఈ ప్రత్యేక రోజును ఆయన తన భార్య అవంతికతో కలిసి వీడియో రూపంలో యూట్యూబ్‌లో పంచుకున్నారు.

ఆ రోజు ఉదయం చిన్నారులంతా బస్సులో సౌరవ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి అందరూ హల్ద్వానీలోని పంత్‌నగర్ విమానాశ్రయానికి బయల్దేరారు. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రతి చిన్నారి చేతిలో బోర్డింగ్ పాస్ కనిపించగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విమానంలో అడుగుపెట్టిన తర్వాత చాలా మంది పిల్లలు తమకు నిజంగానే విమానం ఎక్కామా అని ఆశ్చర్యపోయారు.

ప్రయాణం ప్రారంభానికి ముందు ఆలయానికి వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకున్నామని అవంతిక తెలిపారు. విమానం టేకాఫ్ సమయంలో చాలా మంది చిన్నారులు భయపడ్డారని చెప్పారు. వారితో నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్పామని వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో కూడా కొందరు ఆందోళన చెందగా, సౌరవ్ దంపతులు వారి పక్కనే ఉండి ధైర్యం నింపారు.

విమానం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత చిన్నారులను బస్సులో రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత గేమింగ్ జోన్‌కు వెళ్లి ఆటలు ఆడారు. పిజ్జాలు తింటూ రోజు మొత్తం ఆనందంగా గడిపారు. చిన్నారుల నవ్వులు, సందడి ఆ రోజు ప్రత్యేకతను మరింత పెంచాయి.

సాయంత్రం అందరినీ తిరిగి బస్సులో హల్ద్వానీకి తీసుకొచ్చారు. ప్రతి చిన్నారిని వారి ఇంటి దగ్గర దింపిన తర్వాతే సౌరవ్, అవంతిక తమ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తెల్లవారుజామున నాలుగు గంటలు దాటింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘పేద పిల్లల కలలకు రెక్కలు ఇచ్చారు’’, ‘‘వారి ముఖాల్లోని చిరునవ్వులు చూస్తే హృదయం నిండిపోతుంది’’, ‘‘ఇలాంటి మంచి పనులు మరెందరికో స్ఫూర్తి కావాలి’’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒక్కరోజు విహారయాత్రలా కనిపించినా... ఆ చిన్నారులకు మాత్రం అది జీవితాంతం మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది.
Advertisement
Sourav Joshi
YouTuber
Indigo flight
Underprivileged children
Haldwani
Viral video

More Telugu News