ఏ నియోజకవర్గానికైనా స్థానిక ఎమ్మెల్యేనే బాస్: జగ్గారెడ్డి

Jagga Reddy says local MLA is the boss for any constituency
  • తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు
  • 7 పేజీలతో నివేదికను పీసీసీ చీఫ్ కు అందించిన జగ్గారెడ్డి
  • అందరి నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను తయారు చేశామన్న జగ్గారెడ్డి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, వర్గపోరు అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పరిశీలకుడు జగ్గారెడ్డి తన సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. మొత్తం 7 పేజీలతో కూడిన ఈ రిపోర్టును సీల్డ్ కవర్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఆయన అందజేశారు.


తుంగతుర్తి నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలు, వర్గ విభేదాలపై గత పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరువర్గాలు, స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఆ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నివేదికను రూపొందించినట్లు వెల్లడించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఏ నియోజకవర్గానికైనా స్థానిక ఎమ్మెల్యేనే 'ఫస్ట్ బాస్' అని, ఆ తర్వాతి స్థానంలోనే ఎంపీ, మంత్రులు ఉంటారని స్పష్టం చేశారు. అలాగే మూడో ప్రాధాన్యత డీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వివాదాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రధాన స్తంభాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Jagga Reddy
Thungathurthi Congress
Mahesh Kumar Goud
Telangana Congress politics
Komatireddy Rajagopal Reddy
TPCC internal report

More Telugu News