18 ఏళ్లకే ప్రొఫెసర్‌.. 306 ఏళ్ల రికార్డు బద్దలు

Nathan Thomas becomes professor at 18 breaking 306 year record
  • 18 ఏళ్లకే ప్రపంచ రికార్డు సృష్టించిన నాథన్.
  • అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ రికార్డు
  • పదేళ్లకే కళాశాల విద్య ప్రారంభించిన నాథన్‌
  • 14 ఏళ్లకే ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ పూర్తి
  • మయామి డేడ్ కాలేజీలో అధ్యాపకుడిగా బోధన
  • ప్రస్తుతం న్యాయ విద్య కూడా అభ్యసిస్తున్న నాథన్ 
18 ఏళ్ల వయసులో చాలామంది కాలేజీ జీవితాన్ని మొదలుపెడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అదే వయసులో కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని 306 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.

అమెరికాకు చెందిన నాథన్ థామస్ కేవలం 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే ప్రపంచంలోనే అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఈ ఘనతతో 306 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును అధిగమించాడు.

స్కాట్లాండ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్‌లారిన్ 1717లో 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్‌గా నియమితులయ్యాడు. ఇప్పటి వరకు అదే రికార్డుగా కొనసాగింది. ఇప్పుడు నాథన్ థామస్ దానిని అధిగమించాడు.

నాథన్ పదేళ్ల వయసులోనే డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం ద్వారా మయామి డేడ్ కాలేజీలో చేరాడు. పాఠశాల చదువుతో పాటు కళాశాల విద్యను కొనసాగించాడు. 14 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, మాస్టర్స్‌ను పూర్తి చేశాడు. అనంతరం తాను విద్యార్థిగా చదివిన మయామి డేడ్ కాలేజీలోనే అధ్యాపకుడిగా చేరాడు.

2023 ఆగస్టులో ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘సి ఫర్ ఇంజినీర్స్’ కోర్సు బోధించడం ప్రారంభించాడు. తన వయసుకు దగ్గరగా ఉన్న విద్యార్థులకు బోధించడం ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదని నాథన్ చెబుతున్నాడు. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, ఆసక్తి, అంకితభావమే ముఖ్యమని పేర్కొన్నాడు.

ఇంజినీరింగ్‌తో పాటు ప్రస్తుతం మయామి యూనివర్సిటీ లా స్కూల్‌లో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ కూడా అభ్యసిస్తున్నాడు. 2028లో చదువు పూర్తయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కుల న్యాయ నిపుణుడిగా రాణించడమే తన లక్ష్యమని తెలిపాడు.
Advertisement
Nathan Thomas
Youngest Male Professor
Guinness World Records
Miami Dade College
Colin Maclaurin
Florida International University

More Telugu News