హిట్లర్ ఆదర్శంతో రేవంత్ రెడ్డి హైడ్రాను తెచ్చారు: ఈటల రాజేందర్

Eatala Rajender says Revanth Reddy brought HYDRA with Hitler as inspiration
  • హైడ్రా అనేది పేదలను భయభ్రాంతులకు గురి చేసే సంస్థ అన్న ఈటల
  • పేదల నివాసాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని మండిపాటు
  • కోర్టుల ఆదేశాలను కూడా హైడ్రా లెక్కచేయడం లేదని వ్యాఖ్య

‘హైడ్రా’పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైడ్రా అనేది పేదల ఇళ్లను కూలగొట్టి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ఒక వేధింపుల సంస్థగా మారిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండవచ్చు కానీ, పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే అధికారం మాత్రం లేదని స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను స్థాపించారని ఈటల అన్నారు. నాడు హిట్లర్ ప్రజలను వేధించి తీవ్ర విధ్వంసం సృష్టిస్తే, నేడు రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా తెలంగాణ ప్రజలను అదే రీతిలో వేధిస్తున్నారని ఆరోపించారు. నలభై, యాభై ఏళ్ల క్రితం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి చెరువులు, కాలువల పక్కన రెక్కల కష్టం మీద ఇళ్లు కట్టుకున్న పేదల నివాసాలను ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


తమకు కావాల్సిన బడా బాబులకు భూములు కట్టబెట్టడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ఈటల విమర్శించారు. ప్రస్తుతం నగరంలో హైడ్రా భయంతో ఇల్లు కొనడానికి కూడా ప్రజలు జంకుతున్నారని వ్యాఖ్యానించారు. రెవెన్యూ, మున్సిపల్, హోం శాఖల కంటే హైడ్రా ఒక సుప్రీం శాఖలా వ్యవహరిస్తోందని, ఆఖరికి కోర్టుల ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదని ధ్వజమెత్తారు. అసలు ఈ సంస్థ సీఎం రేవంత్ రెడ్డి మాటైనా వింటుందో లేదో అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు.

Advertisement
Eatala Rajender
Revanth Reddy
HYDRA Telangana
Hyderabad House Demolitions
Telangana BJP
Hitler Comparison

More Telugu News