భారత్‌లోనే ఇవి సాధ్యం: భారతీయ జీవనశైలిపై పోలెండ్ మహిళ పోస్ట్ వైరల్

Only possible in India Polish womans post on Indian lifestyle goes viral
  • భారత్‌లో తన అలవాట్లపై పోలిష్ మహిళ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
  • "నేను భారత్‌లో తప్ప ఇంకెక్కడా చేయలేని పనులు" అంటూ పోస్టు
  • ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి ఇంట్లోనే రెడీ అవుతుంటామని వ్యాఖ్య
భారతదేశంలో నివసిస్తున్న పోలెండ్‌కు చెందిన డొమినికా పటాలస్‌ కల్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. "నేను భారత్‌లో తప్ప ప్రపంచంలో మరెక్కడా చేయలేని పనులు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఆమె పంచుకున్న విశేషాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. భారతీయ జీవనశైలిలోని విలక్షణతలను, ఇక్కడి ప్రజల సరదా అలవాట్లను ఆమె వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది.

ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు, "అపరిచితులను సైతం భయ్యా, దీదీ, అంకుల్ అని ఆప్యాయంగా పిలవడం ఇక్కడే చూస్తాం. ఏదైనా అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ కన్నా రోడ్డు మీద కనిపించే అంకుల్‌ను అడగడానికే నేను ప్రాధాన్యమిస్తాను. ఇక పక్కింటి వారు ప్రేమతో అందించే ఆహారాన్ని తిరస్కరించడం వారిని అవమానించినట్లే అవుతుందని ఇక్కడకు వచ్చాకే గ్రహించాను" అని వివరించారు.

అంతేకాకుండా, "కాస్త పరిచయం ఉన్న ఆంటీలు నా వ్యక్తిగత జీవితం, పెళ్లి, బరువు వంటి విషయాలపై ఉచిత సలహాలు ఇచ్చినా నవ్వి ఊరుకోవడం ఇక్కడే సాధ్యం. కేవలం 12 సెకన్ల సంభాషణతోనే ఆటో డ్రైవర్‌ను నమ్మి ప్రయాణించడం, వీధి చివర గ్లాసులో టీ తాగుతూ ఫైవ్‌స్టార్ హోటల్ అనుభూతిని పొందడం వంటివి కేవలం భారత్‌లోనే సాధ్యం. ఇక 'ఐదు నిమిషాల్లో వస్తున్నా' అని చెప్పి, అప్పటికింకా ఇంట్లోనే తయారవుతూ ఉండటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు" అంటూ ఆమె చమత్కరించారు.

ఇతరుల ఇళ్లలోకి ఉన్నపళంగా వెళితే ఏమనుకుంటారోనని ఆలోచించనని, అలాగే వారు కూడా ఏమాత్రం ఇబ్బందిపడకుండా సాదరంగా ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. ఏదైనా పెళ్లికి వెళ్లినప్పుడు చాలామందితో పెద్దగా పరిచయం లేనప్పటికీ, నేను వారి కుటుంబ సభ్యురాలిలా ఇట్టే కలిసిపోతానని పేర్కొన్నారు.

డొమినికా చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. "మీరు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని అర్హతలు సాధించారు", "మీరు అచ్చం భారతీయురాలిగా మారిపోయారు" "చివరి పాయింట్ మాత్రం అక్షర సత్యం" అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్ట్ ద్వారా ఆమె భారతీయ సంస్కృతిలో ఎంతగా మమేకమయ్యారో స్పష్టమవుతోంది.
Advertisement
Dominika Patalas Kalra
Polish woman in India
Indian lifestyle viral post
Indian culture and traditions

More Telugu News