ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. పతకాల పట్టికలో టాప్‌లో నిలిచిన ఆస్ట్రేలియా.. భారత్ ర్యాంక్ ఎంతంటే..!

Commonwealth Games ends Australia tops table and India rank revealed
  • ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా తొలి మూడు స్థానాలు కైవసం 
  • 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్ 
  • భారత ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు 
  • బాక్సింగ్‌లో 7 స్వర్ణాలతో భార‌త్‌ అత్యుత్తమ ప్రదర్శన 
  • వెయిట్‌లిఫ్టింగ్‌లో 8 పతకాలు.. అథ్లెటిక్స్, జూడోలోనూ రాణించిన అథ్లెట్లు
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 39 పతకాలను సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ మెగా టోర్నీలో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఈసారి క్రీడల్లో బాక్సింగ్ విభాగం భారత్‌కు పతకాల పంట పండించింది.

ఈ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన ఘనత బాక్సింగ్‌కే దక్కుతుంది. భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించారు. అంటే.. 14 మంది సభ్యులతో కూడిన బాక్సింగ్ బృందంలో 10 మంది పతకాలతో తిరిగి రావడం విశేషం. బాక్సింగ్ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఈ విభాగంలో మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. వీరితో పాటు అథ్లెటిక్స్, జూడో విభాగాల్లోనూ మన క్రీడాకారులు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

అయితే, క్రీడల చివరి రోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆఖరి రోజు జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక్క పతకం కూడా లభించలేదు. జూడోలో ఇష్రూప్ నారంగ్, అవతార్ సింగ్, యశ్ ఘంగాస్ పతకాలు సాధించడంలో విఫలమయ్యారు. అలాగే, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్లలో రొనాల్డో సింగ్ లైటన్‌జామ్, లిషా దాస్ కూడా పతకాలకు దూరంగా నిలిచారు. దీంతో ముందు రోజు నాటి 39 పతకాలతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పతకాల పట్టికలో ఆస్ట్రేలియా ఎప్పటిలాగే అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం మొత్తం 171 పతకాలు (70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలు) సాధించింది. ఇంగ్లండ్ 110 పతకాలతో (29 స్వర్ణాలు) రెండో స్థానంలో, కెనడా 62 పతకాలతో (19 స్వర్ణాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఆతిథ్య దేశం స్కాట్లాండ్ కూడా 39 పతకాలు సాధించినప్పటికీ, రజతాల సంఖ్యలో భారత్ (17) కంటే వెనుకబడి (9) ఐదో స్థానానికి పరిమితమైంది. దీంతో భారత్ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. న్యూజిలాండ్ (36), నైజీరియా (24) వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇక‌, పాకిస్థాన్ ఒకే ఒక కాంస్యంతో 36వ స్థానంలో నిలిచింది. 
Advertisement
Commonwealth Games
India medal tally 2026
Australia top ranker
Indian boxing gold medals
Commonwealth Games rankings
India fourth place

More Telugu News