అభిషేక్ శర్మ వీర మాస్ కొట్టుడు.. 25 సిక్సర్లతో ఊచకోత.. 91 బంతుల్లో 233 రన్స్

Abhishek Sharma Mass Hitting 233 Runs in 91 Balls with 25 Sixes
  • పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ
  • కేవలం 91 బంతుల్లోనే 233 పరుగులు చేసిన యంగ్ ఓపెనర్
  • ఇన్నింగ్స్‌లో 25 సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన వైనం
  • అంతర్జాతీయ క్రికెట్‌లో విఫలమవుతున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్
  • అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ తో జట్టు స్కోరు 50 ఓవర్లలో 533/8
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంతకాలంగా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అతను, దేశవాళీ వన్డే మ్యాచ్‌లో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ టోర్నమెంట్‌లో అమృత్‌సర్ తరఫున ఆడిన అభిషేక్, కేవలం 91 బంతుల్లోనే 233 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఏకంగా 25 సిక్సర్లు, 15 ఫోర్లు ఉండటం విశేషం. అభిషేక్ ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మ్యాచ్ లో అతడికి బౌలింగ్ చేయాలంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.

టార్న్ టరన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 256.04 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరద పారించాడు. అతని అద్భుత బ్యాటింగ్ కారణంగా అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అభిషేక్ అసాధారణ ఇన్నింగ్స్‌కు సంబంధించిన స్కోర్‌కార్డు, బ్యాటింగ్ క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వేళ..
ఇటీవలే ముగిసిన జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా, మూడుసార్లూ ఒకే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో అతని సగటు కేవలం 3.66 మాత్రమే.

ఈ వైఫల్యం జింబాబ్వే సిరీస్‌కే పరిమితం కాలేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు దాదాపు 195 స్ట్రైక్ రేట్‌తో, 37 సగటుతో ఆడిన అభిషేక్.. ఆ తర్వాత గణనీయంగా పడిపోయాడు. అతని సగటు 19.4కి, స్ట్రైక్ రేట్ 165కి తగ్గింది. గత 10 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే నమోదు చేశాడు. దూకుడుగా ఆడాలో, నిలకడగా ఆడాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు అతని బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఫామ్ కోల్పోయి ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న సమయంలో.. అభిషేక్ సాధించిన ఈ డబుల్ సెంచరీ అతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. తిరిగి తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి, విమర్శకులకు దీటుగా బదులివ్వడానికి ఈ ఇన్నింగ్స్ దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
Advertisement
Abhishek Sharma
Double Century
Punjab Cricket
Amritsar Cricket
Domestic One Day Match
Indian Cricket News

More Telugu News