Advertisement

మాస్కోలో బాంబు పేలుడు.. మహిళ సహా ముగ్గురి మృతి, 21 మందికి గాయాలు

Moscow bomb blast leaves three dead and twenty-one injured
  • మృతుల్లో బాంబు తెచ్చిన మహిళ, సెక్యూరిటీ గార్డు, కస్టమర్
  • రెస్టారెంట్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పేలుడు
  • రిమోట్‌తో పేల్చి ఉండొచ్చని అనుమానాలు
  • ఘటనకు, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధం లేదన్న అధికారులు
రష్యా రాజధాని మాస్కోలో శనివారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా, కనీసం 21 మంది గాయపడ్డారు. స్వయంగా తయారు చేసిన బాంబును తీసుకువచ్చిన గుర్తుతెలియని మహిళతో పాటు మరో ఇద్దరు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మాస్కో నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కుడ్రిన్‌స్కయా స్క్వేర్‌లోని ఓ చారిత్రక భవనంలో ఉన్న బాల్జి రోస్సీ అనే ఇటాలియన్ రెస్టారెంట్ వెలుపల స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాంబుతో వచ్చిన ఓ మహిళ రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే, అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. కొద్ది క్షణాల్లోనే ఆమె వద్ద ఉన్న బాంబు పేలింది. ఈ ఘటనలో ఆ మహిళ, సెక్యూరిటీ గార్డు, రెస్టారెంట్‌లోని ఒక కస్టమర్ అక్కడికక్కడే మరణించారు.

పేలుడు ధాటికి 21 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా బృందాలు, సాయుధ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

అయితే, ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. మృతుల వివరాలను కూడా గోప్యంగా ఉంచారు. కాగా, రెస్టారెంట్ బయట ఉన్న టెర్రస్‌లో కూర్చున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉండవచ్చని ‘కొమ్మర్సంట్’ అనే స్థానిక పత్రిక తన కథనంలో పేర్కొంది. బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చి ఉండవచ్చని, దాన్ని మోసుకొచ్చిన మహిళకు అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయనే విషయం తెలియకపోవచ్చునని కూడా అనుమానం వ్యక్తం చేసింది.

ఘటన జరిగిన శనివారం నాడు ఒక ప్రైవేట్ కార్యక్రమం కారణంగా రెస్టారెంట్‌ను ప్రజల కోసం మూసివేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడం కలకలం రేపుతోంది. అయితే, ఈ పేలుడుకు, గతంలో జరిగిన దాడులకు ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తేల్చారు.
Advertisement
Moscow
Russia bomb blast
Balzi Rossi restaurant
Kudrinskaya Square explosion
Moscow terror attack
Russia emergency services

More Telugu News