వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చే ఆహార ఉత్పత్తులపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా, నిబంధనలను ఉల్లంఘించిన రెండు ఉత్పత్తులపై గురువారం నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

వటవే హెల్త్ కేర్ సంస్థ తయారుచేస్తున్న 'ఫోలిన్యూరో సిరప్ - ఫోలినిక్ యాసిడ్ సిరప్' తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై నిషేధం విధించింది. ఈ సిరప్ పేరులో 'న్యూరో' అనే పదాన్ని చేర్చడంతో పాటు, ప్యాకింగ్‌పై మెదడు చిత్రాన్ని ముద్రించడం ద్వారా ఇది మెదడు, నరాల పనితీరును మెరుగుపరుస్తుందనే తప్పుడు సంకేతాలను పంపిస్తోందని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆహార భద్రతా ప్రమాణాల్లో లేని 'న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్' కేటగిరీ కింద దీనిని వర్గీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరో ఘటనలో, గ్లోబల్ హెల్త్‌ఫిట్ రిటైల్ ఇండియా మార్కెట్ చేస్తున్న 'న్యూహెర్బ్స్ ట్రూ విటమిన్' విక్రయాలను సైతం ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. 'ట్రూ విటమిన్' అనే వాణిజ్య నామం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇది వినియోగదారులను పెడదోవ పట్టించేలా ఉందని స్పష్టం చేసింది. తక్షణమే అమ్మకాలను నిలిపివేయాలని, లేబుల్స్ మరియు ప్రకటనల నుంచి అభ్యంతరకర అంశాలను తొలగించాలని ఆదేశించింది. దీనిపై చేపట్టిన చర్యల నివేదికను 30 రోజుల్లోగా సమర్పించాలని సదరు కంపెనీని ఆదేశించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.