ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, రాషా థడానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, తాజాగా ‘ఉక్కిరిబిక్కిరి’ పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ స్వరకర్త జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి చంద్రబోస్ సాహిత్యం అందించగా, గాయకుడు హరిచరణ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. హీరో హీరోయిన్ల మధ్య గాఢమైన ప్రేమను, భావోద్వేగాలను ఆవిష్కరించేలా ఈ పాటను చిత్రీకరించారు. అందమైన విజువల్స్, జయకృష్ణ-రాషాల మధ్య కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక అందమైన ప్రేమకథకు జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పి పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత సి. అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మాజీ, నరేష్, కిక్ శ్యామ్, అజయ్, వాసుకి వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జయకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Play video