బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, ఆయన భార్య సునీత కపూర్ ప్రతి ఏటా కర్వా చౌత్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా గురువారం సాయంత్రం ముంబైలోని వారి నివాసంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన భర్త షారుఖ్ లేకుండా ఆమె ఒంటరిగానే ఈ వేడుకకు హాజరుకావడం విశేషం.

సిల్వర్-గ్రే రంగు ఎంబ్రాయిడరీ డిజైన్ కలిగిన సంప్రదాయ దుస్తుల్లో గౌరీ ఖాన్ ఎంతో హుందాగా కనిపించారు. ఈ దుస్తులకు సరిపోయేలా మ్యాచింగ్ దుపట్టా, స్టేట్‌మెంట్ చెవిపోగులను ఆమె ధరించారు. కపూర్ నివాసం వెలుపల వేచి ఉన్న ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చిన అనంతరం ఆమె వేడుకలోకి వెళ్లారు.

ఈ వేడుకలో ఫరా ఖాన్, జావేద్ అక్తర్, సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా దంపతులు, శిల్పా శెట్టి, మీరా రాజ్‌పుత్, నటాషా దలాల్, పద్మిని కొల్హాపురే వంటి ప్రముఖులు సందడి చేశారు. శిల్పా శెట్టి పింక్-రెడ్ కాంబినేషన్ చీరలో మెరవగా, మీరా రాజ్‌పుత్ గోల్డెన్ శారీలో ఆకట్టుకున్నారు.

అనిల్ కపూర్ మేనకోడలు అన్షులా కపూర్‌కు వివాహం తర్వాత ఇదే తొలి కర్వా చౌత్. ఈ ఏడాది జులై 6న రోహన్ ఠక్కర్‌ను వివాహం చేసుకున్న ఆమె, డీప్-రెడ్ కుర్తా ధరించి ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. వీరితో పాటు మహీప్ కపూర్, భావనా పాండే, నీలమ్ కొఠారి వంటి ఇతర తారలు కూడా ఈ వేడుకలో మెరిశారు.