న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి వికెట్‌ను పడగొట్టడం ద్వారా శాంట్నర్ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న తన సహచర ఆటగాడు ఇష్ సోధీని శాంట్నర్ అధిగమించాడు. దీంతో భారత్‌పై అతని వికెట్ల సంఖ్య 32కు చేరింది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ జోర్డాన్ (24), జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ (22) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇదే మ్యాచ్‌లో శాంట్నర్ మరో మైలురాయిని కూడా చేరుకున్నాడు. టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసిన మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 142 మ్యాచ్‌లలో 151 వికెట్లు పడగొట్టాడు.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. శాంట్నర్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, గ్లెన్ ఫిలిప్స్ (107), మైఖేల్ బ్రేస్‌వెల్ (65) చెలరేగడంతో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్‌ను 172/9 స్కోరుకే పరిమితం చేసి 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.