స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల ఖాతాలో మరో పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో, భారత లిఫ్టర్ రిషికాంత సింగ్ చనమ్‌బామ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో సరికొత్త గేమ్స్ రికార్డు సృష్టించినప్పటికీ, ఓవరాల్‌గా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీల్లో నాలుగో రోజు భారత్‌కు ఇదే తొలి పతకం.

ఈ పోటీలో రిషికాంత స్నాచ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ప్రయత్నంలో 116 కేజీలు, రెండో ప్రయత్నంలో 119 కేజీలు ఎత్తిన అతను, మూడో ప్రయత్నంలో ఏకంగా 121 కేజీల బరువును విజయవంతంగా ఎత్తాడు. ఈ లిఫ్ట్‌తో స్నాచ్ విభాగంలో సరికొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుని అగ్రస్థానంలో నిలిచాడు.

అయితే, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో పోటీ తీవ్రంగా మారింది. తొలి ప్రయత్నంలో 143 కేజీలు ఎత్తి పతక రేసులో ముందంజలో ఉన్న రిషికాంత, స్వర్ణం లక్ష్యంగా రెండో ప్రయత్నంలో 148 కేజీలు, మూడో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. చివరి ప్రయత్నంలో బరువును భుజాల పైకి తెచ్చినప్పటికీ, జర్క్‌ను పూర్తి చేయలేకపోవడంతో మొత్తం 264 కేజీల బరువుతో తన ప్రస్థానాన్ని ముగించాడు.

ఇదే అదునుగా భావించిన మలేషియా లిఫ్టర్ బిన్ కస్దాన్ మహ్మద్ అనీక్, క్లీన్ అండ్ జర్క్‌లో అద్భుతంగా రాణించి మొత్తం 273 కేజీలతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది కూడా ఓవరాల్‌గా కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు కావడం విశేషం. కెన్యాకు చెందిన జాషువా అముంగా బోయా 260 కేజీలతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. స్వర్ణ పతకాన్ని త్రుటిలో చేజార్చుకున్నప్పటికీ, రిషికాంత తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు.