Advertisement

ఒత్తిడి, మానసిక సమస్యలు అందుకేనట.. మనిషి మెదడు గురించి షాకింగ్‌ స్టడీ!

Human brain evolution not adapted to modern lifestyle says Singapore study
  • ఆధునిక జీవితానికి మెదడు పూర్తిగా అలవాటు కాలేదని అధ్యయనం
  • సోషల్‌ మీడియా, నగర జీవనం ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడి
  • అందుకే ఆందోళన, ఒంటరితనం పెరుగుతున్నాయన్న పరిశోధకులు
  • వాతావరణ, ఆర్థిక సంక్షోభాలు కూడా ప్రభావం చూపుతున్నాయన్న అధ్యయనం
  • ఏఐ, సాంకేతిక మార్పులు అభద్రతాభావం పెంచుతున్నాయని వివరణ
  • పచ్చని ప్రదేశాలు, మెరుగైన నగరాలు అవసరమని సూచన
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా మన మెదడు రూపుదిద్దుకోలేదని, అందుకే నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు వారు నిర్వహించిన అధ్యయనం ‘బిహేవియరల్ సైన్సెస్ జర్నల్‌’లో ప్రచురితమైంది.

పరిశోధకుల వివరాల ప్రకారం.. మానవ మెదడు లక్షల ఏళ్ల క్రితం చిన్న చిన్న సమూహాల్లో జీవించే పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. అప్పట్లో మనుషులు ఎదుర్కొన్న సవాళ్లు పరిమితంగానే ఉండేవి. అయితే ప్రస్తుతం నగర జీవనం, నిరంతర ఇంటర్నెట్‌ వినియోగం, సోషల్‌ మీడియా, ఇతరులతో నిరంతర పోలికలు వంటి పరిస్థితులు మెదడుపై అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల వల్ల చాలామంది నిరంతర ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిని కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా ఆధునిక జీవనశైలి ప్రభావంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు.

అలాగే వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మహమ్మారులు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతిక పరిణామాలు ఒకేసారి ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని, దీనిని పరిశోధకులు ‘పాలీక్రైసిస్‌’గా పేర్కొన్నారు. ఇవి అభద్రతాభావాన్ని, పోటీని పెంచి మానసిక అలసట (బర్నౌట్‌)తో పాటు జీవన నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రజల మానసిక అవసరాలకు అనుగుణంగా నగరాలు, ఆఫీసులు, డిజిటల్‌ వేదికలను రూపకల్పన చేయాలని పరిశోధకులు సూచించారు. మరిన్ని పచ్చని ప్రదేశాలు, తక్కువ ఒత్తిడిని కలిగించే పట్టణ వాతావరణం, అనారోగ్యకరమైన పోటీని తగ్గించే ఆన్‌లైన్‌ వేదికలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు అవసరమని కూడా వెల్లడించారు.
Advertisement
Human Brain
Mental Health Study
Modern Lifestyle Stress
Behavioral Sciences Journal
Polycrisis Mental Health
Singapore Scientists Research

More Telugu News