చెన్నై వేదికగా జరుగుతున్న క్వాంట్‌బాక్స్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌-2026లో తెలంగాణకు చెందిన భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి సంచలన విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఐదో రౌండ్ పోరులో ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌పై నల్లపావులతో ఆడి గెలుపొందాడు. ఈ విజయంతో అర్జున్ టోర్నీ పాయింట్ల పట్టికలో సంయుక్త అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

మొత్తం ఏడు రౌండ్ల ఈ టోర్నీలో ఐదు రౌండ్లు ముగిసేసరికి అర్జున్ ఇరిగేసి, ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరోజా చెరో 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ టోర్నీలో రెండో ఓటమిని చవిచూసిన గుకేశ్, 1.5 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయాడు. ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ నోదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ 3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

అర్జున్, గుకేశ్‌ల మధ్య జరిగిన ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆట ప్రారంభంలో గుకేశ్ పటిష్ఠమైన ఎత్తుగడలతో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, సమయం మించిపోతున్న కొద్దీ ఒత్తిడికి లోనై తడబడ్డాడు. కేవలం నిమిషం కంటే తక్కువ సమయం మిగిలి ఉన్న తరుణంలో, 54వ ఎత్తు వద్ద గుకేశ్ చేసిన తప్పిదం అర్జున్‌కు కలిసివచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అర్జున్, 63వ ఎత్తులో గుకేశ్‌ ఓటమిని అంగీకరించేలా చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

ఇతర మ్యాచ్‌లలో నిహాల్ సరిన్‌పై నోదిర్‌బెక్ విజయం సాధించగా, ప్రణేశ్-హన్స్ నీమన్, ఫిరోజా-ఆండ్రీకిన్‌ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. రూ. 75 లక్షల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మంగళవారం జరగనున్న ఆరో రౌండ్‌లో అబ్దుసత్తరోవ్‌తో ఫిరోజా, నిహాల్ సరిన్‌తో అర్జున్ తలపడనున్నారు.