ఆర్బీఐ పేరుతో ఫేక్ లెటర్.. రూ. 7,500 కడితే లక్ష రూపాయలంటూ మోసం!

Fake RBI letter scam promising one lakh rupees for paying 7500 tax
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపేరుతో సోషల్ మీడియాలో నకిలీ లేఖ
  • రూ. 7,500 చెల్లిస్తే లక్ష రూపాయలు ఇస్తామంటూ ప్రచారం
  • ఇది మోసపూరిత చర్య అని స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
  • ఇలాంటి సందేశాలను నమ్మవద్దని ప్రజలకు సూచన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరిట సామాజిక మాధ్యమాల్లో ఒక నకిలీ లేఖ విస్తృతంగా ప్రచారమవుతోంది. రూ. 7,500 'రిఫండబుల్ ట్యాక్స్' చెల్లిస్తే, లక్ష రూపాయలు అందిస్తామని ఆ లేఖలో హామీ ఇస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా మోసపూరితమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం శుక్రవారం హెచ్చరించింది.

సదరు లేఖను రిజర్వ్ బ్యాంక్ జారీ చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ముందస్తు చెల్లింపుల పేరుతో ప్రజలను వంచించే ప్రయత్నంలో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు లేదా ఇతర రుసుముల పేరుతో డబ్బులు చెల్లిస్తే నగదు బహుమతులు ఇస్తామని ఆర్బీఐ ఎప్పుడూ లేఖలు పంపదని, అలాంటి పథకాలను ప్రకటించదని తేల్చిచెప్పింది.

ప్రభుత్వ సంస్థల పేరు, అధికారిక లోగోలను దుర్వినియోగం చేస్తూ నకిలీ పత్రాలతో ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తుంటారు. తొలుత చిన్న మొత్తంలో నగదు కట్టించుకుని, ఆ తర్వాత భారీ మొత్తం ఇస్తామని ఆశ చూపడం 'అడ్వాన్స్-ఫీ' మోసాల్లో సర్వసాధారణం. బాధితులు డబ్బు చెల్లించిన వెంటనే, నేరగాళ్లు ఆ మొత్తాన్ని గుర్తించలేని ఖాతాలకు మళ్లించి అదృశ్యమవుతుంటారు.

ఇటువంటి అనుమానాస్పద సందేశాలకు స్పందించవద్దని, ఎవరికీ ఎటువంటి చెల్లింపులు చేయవద్దని పీఐబీ ప్రజలకు సూచించింది. ఏదైనా సమాచారం అందినప్పుడు అధికారిక మార్గాల ద్వారా వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని కోరింది. ఒకవేళ ఎవరైనా మోసపోయి ఉంటే, వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
Reserve Bank of India
RBI fake letter scam
PIB Fact Check
Online fraud warning
Cyber crime alert
Refundable tax scam

More Telugu News