వరల్డ్ కప్ ఫైనల్‌కు రెఫరీగా విన్సిచ్.. అర్జెంటీనాకు పాత భయాలు.. మెస్సీ అభిమానుల్లో టెన్షన్!

Slavko Vincic referee for World Cup Final old fears for Argentina tension among Messi fans
  • 2026 ప్రపంచకప్ ఫైనల్‌కు రెఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్
  • 2022లో విన్సిచ్ రెఫరీయింగ్‌లోనే సౌదీ చేతిలో అర్జెంటీనా ఓటమి
  • తాజా నియామకంతో అర్జెంటీనా అభిమానుల్లో నెలకొన్న ఆందోళన
  • స్పెయిన్ ఆడిన కీలక మ్యాచ్‌లలో విన్సిచ్ రెఫరీగా వ్యవహరించి సానుకూల ఫలితాలు
  • ఫైనల్‌లో విన్సిచ్ ప్రతి నిర్ణయంపై తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం
2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగే ఈ టైటిల్ పోరుకు స్లోవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్కో విన్సిచ్‌ను ఫిఫా నియమించింది. ఈ వార్త ఫుట్‌బాల్ ప్రపంచంలో సంతోషం నింపినప్పటికీ, అర్జెంటీనా అభిమానుల్లో మాత్రం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి కారణం విన్సిచ్ రెఫరీయింగ్‌లో అర్జెంటీనాకు ఉన్న ఒక చేదు గతం. 

ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు తనను ఎంపిక చేసినట్లు తెలియగానే, రెఫరీ కిట్ అందుకుంటూ విన్సిచ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతనికి సహాయకులుగా తోమాజ్ క్లాంక్నిక్, ఆండ్రాజ్ కోవాసిచ్ (ఇద్దరూ స్లోవేనియాకు చెందినవారే) వ్యవహరించనున్నారు.

అర్జెంటీనాకు ఎందుకు ఆందోళన?
స్లావ్కో విన్సిచ్ పేరు వినగానే అర్జెంటీనా అభిమానులకు 2022 ఖతార్ ప్రపంచకప్‌లో జరిగిన ఒక ఘోర పరాభవం గుర్తుకొస్తుంది. ఆ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆడిన తొలి మ్యాచ్ సౌదీ అరేబియాతో జరిగింది. నవంబర్ 22న లుసైల్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌కు విన్సిచ్ రెఫరీగా ఉన్నాడు. ఆట ప్రారంభమైన 8వ నిమిషంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ ఇవ్వగా, మెస్సీ గోల్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం మీద సౌదీ ఆటగాళ్లకు ఆరు ఎల్లో కార్డులు కూడా చూపించాడు. కానీ, చివరికి ఫలితం తారుమారైంది. సెకండాఫ్‌లో సౌదీ అరేబియా సంచలన ప్రదర్శన చేసి 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచకప్ చరిత్రలోనే అది ఒక పెద్ద షాక్. మెస్సీ జట్టు విన్సిచ్ రెఫరీయింగ్ లో ఓడిపోయిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ పాత జ్ఞాపకాలే ఇప్పుడు అర్జెంటీనా అభిమానులను కలవరపెడుతున్నాయి.

స్పెయిన్‌కు మాత్రం సానుకూల చరిత్ర
అర్జెంటీనాకు విన్సిచ్‌తో చేదు అనుభవం ఉంటే, స్పెయిన్‌కు మాత్రం అతనితో సానుకూల రికార్డు ఉంది. యూరోపియన్ టోర్నీలలో స్పెయిన్ ఆడిన అనేక కీలక మ్యాచ్‌లకు విన్సిచ్ రెఫరీగా వ్యవహరించాడు. 2017లో కొలంబియాతో స్నేహపూర్వక మ్యాచ్, యూరో 2020లో స్వీడన్‌తో గ్రూప్ మ్యాచ్, 2023లో ఇటలీతో నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు అత‌డు బాధ్యతలు నిర్వర్తించాడు. ముఖ్యంగా యువ సంచలనం లామిన్ యమాల్ జట్టులోకి వచ్చాక, యూరో 2024లో ఇటలీ, ఫ్రాన్స్‌లపై స్పెయిన్ గెలిచిన కీలక మ్యాచ్‌లకు విన్సిచ్ రెఫరీగా ఉన్నాడు. ఈ రికార్డు స్పెయిన్ జట్టుకు కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ వరల్డ్‌కప్‌లోనూ వివాదం
ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా విన్సిచ్ తన కఠిన నిర్ణయాలతో వార్తల్లో నిలిచాడు. మెక్సికో-ఈక్వెడార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పీరో హిన్కాపీకి రెడ్ కార్డ్ చూపించాడు. ప్రత్యర్థి ఆటగాడితో మాట్లాడేటప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకోవడం ఫిఫా నియమావళిని ఉల్లంఘించడమేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే, అత‌డు నిబంధనల విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో అర్థమవుతుంది. అర్జెంటీనా మ్యాచ్‌లలో రెఫరీ నిర్ణయాలు తరచూ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో, ఈ ఫైనల్‌లో స్లావ్కో విన్సిచ్ ప్రతి నిర్ణయంపై ప్రపంచం దృష్టి నిలుస్తుంది. అతనిపై తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం.
Advertisement
Slavko Vincic
Argentina vs Spain
FIFA World Cup 2026 Final
Lionel Messi
New York World Cup
Football Referee News

More Telugu News