తెలుగు ఇండస్ట్రీని ఆకాశానికెత్తిన రకుల్ ప్రీత్.. బాలీవుడ్‌పై తీవ్ర విమర్శలు

Rakul Preet Singh praises Tollywood and criticizes Bollywood work culture
  • టాలీవుడ్, బాలీవుడ్ పనివిధానంపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • బాలీవుడ్ కంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఐక్యత ఎక్కువన్న నటి
  • టాలీవుడ్‌లో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారని ప్రశంస
  • బాలీవుడ్‌లో అసూయ, నెగెటివ్ పీఆర్ సర్వసాధారణమని వ్యాఖ్య
టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పనితీరుపై కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సహకార స్ఫూర్తిని కొనియాడిన ఆమె, బాలీవుడ్‌లో మాత్రం అభద్రతాభావం, అసూయ వంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్, తన సినీ ప్రయాణం మొదలైన తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. "టాలీవుడ్‌లో ఒకరి సినిమాలను మరొకరు బహిరంగంగా ప్రోత్సహిస్తారు. తోటి నటీనటుల చిత్రాల ట్రైలర్లను వడుదల చేయడం, వేడుకలకు హాజరవ్వడం వంటివి ఇక్కడ సాధారణం. వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, ఒకరి విజయాన్ని మరొకరు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు" అని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయంలో బాలీవుడ్ పరిస్థితి భిన్నంగా ఉంటుందని, అక్కడ అసూయ, అభద్రతాభావం కారణంగా పరస్పర సహకారం చాలా తక్కువని ఆమె అన్నారు. కొందరు కావాలనే ఇతరులపై ప్రతికూల ప్రచారాలు (నెగెటివ్ పీఆర్ క్యాంపెయిన్లు) నిర్వహిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"తెలుగు పరిశ్రమలో ఐక్యత, సహృద్భావం మెండుగా ఉంటాయి. ఈ లక్షణాలను హిందీ పరిశ్రమ కూడా అలవర్చుకుంటే అది మరింత బలోపేతం అవుతుంది" అని రకుల్ సూచించారు. గతంలోనూ అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి అగ్ర హీరోల వినయాన్ని, వృత్తి పట్ల వారికున్న నిబద్ధతను ఆమె కొనియాడారు. దక్షిణాదిలో గడించిన అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని, ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె కృతజ్ఞత చాటుకున్నారు. రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఎదుగుదలకు తోడ్పడిన పరిశ్రమ పట్ల ఆమె చూపిన గౌరవానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Rakul Preet Singh
Tollywood
Bollywood
Telugu Film Industry
South Indian Cinema
Film Industry Unity

More Telugu News