త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. కీలక ప్రయోగానికి ఆర్బీఐ సిద్ధం!

RBI ready for key experiment to introduce plastic currency notes soon
  • త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రయోగానికి ఆర్బీఐ శ్రీకారం!
  • మొదటగా రూ. 10, రూ. వ20 డినామినేషన్లలో పైలట్ ప్రాజెక్టు
  • కాగితం నోట్ల కంటే ఎక్కువ మన్నిక, భద్రత కలిగిన పాలిమర్ నోట్లు
  • ప్రస్తుత కాగితం నోట్లు యథావిధిగా చలామణి
  • 2027 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం
దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించి, 2027 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తొలి దశలో భాగంగా రూ. 10, రూ. 20 వంటి తక్కువ ముఖ విలువ కలిగిన నోట్లతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించాలని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దు చేయకుండానే, దశలవారీగా ఈ కొత్త పాలిమర్ నోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన పాలిమర్ షీట్లను సరఫరా చేసేందుకు ఆర్బీఐ నోట్ల ముద్రణ విభాగం ఇప్పటికే గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) జారీ చేసింది. బిడ్లు దాఖలుకు ఆగస్టు 18ని తుది గడువుగా నిర్ణయించింది.

దేశంలో యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగినప్పటికీ, నగదు వినియోగం మాత్రం తగ్గలేదు. దీనికి తోడు పాత నోట్ల స్థానంలో కొత్త వాటిని ముద్రించడం వల్ల ముద్రణా వ్యయం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాటన్‌తో తయారు చేసే కాగితపు నోట్లకు బదులు, ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ నోట్లను తీసుకురావడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా నీరు, మురికి వంటి వాటికి త్వరగా పాడవవు. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల్లో ఇవి విజయవంతంగా చలామణిలో ఉన్నాయి.

గతంలో 2012-14 మధ్య కాలంలోనే ఆర్బీఐ ఈ ప్రతిపాదన చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్ర బ్యాంక్, ఏటీఎంలలో వీటి అనుకూలత వంటి సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అయితే, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Advertisement
RBI
Plastic currency notes India
Polymer currency notes pilot project
RBI new currency notes 2027
Indian currency printing costs

More Telugu News