టీమిండియాకు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఎంత కీలక ఆటగాళ్లో ఇంగ్లండ్‌కు జో రూట్‌ అంతే కీలకమని మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు. ఒత్తిడిలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే సామర్థ్యం ఈ ముగ్గురిలోనూ ఒకేలా ఉంటుందని చెప్పాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో రూట్‌ ఆడిన 99 పరుగుల ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు.

234 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్‌ 133 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ను చివరి వరకు నడిపించి ఇంగ్లండ్‌కు నాలుగు వికెట్ల విజయాన్ని అందించాడు. అయితే గస్‌ అట్కిన్సన్‌ బౌండరీ కొట్టడంతో రూట్‌ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

రూట్‌ ఇప్పటికీ సంప్రదాయ వన్డే శైలిలోనే బ్యాటింగ్‌ చేస్తాడని కుంబ్లే పేర్కొన్నాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా, రూట్‌ మాత్రం ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడని చెప్పాడు. స్ట్రైక్‌ను మారుస్తూ, గ్యాప్‌లలోకి బంతిని పంపిస్తూ ఒత్తిడిని తగ్గించడంలో అతను సిద్ధహస్తుడని కొనియాడాడు. అవసరం లేని సమయంలో రిస్క్‌ షాట్లు ఆడకపోవడమే అతని బలం అని వివరించాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌తో పోలిస్తే రూట్‌ ప్రత్యేకత స్పష్టంగా కనిపించిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు సహకరించని పిచ్‌పై కూడా బ్రూక్‌ టీ20 తరహా షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడని, రూట్‌ మాత్రం వన్డే బ్యాటింగ్‌కు ఆదర్శంగా నిలిచే ఇన్నింగ్స్‌ ఆడాడని పేర్కొన్నాడు.

రూట్‌, విరాట్‌, రోహిత్‌ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం కూడా ఇదేనని కుంబ్లే చెప్పాడు. ఈ ముగ్గురు ముందే షాట్‌ నిర్ణయించుకోరని, బంతిని చూసి స్పందిస్తారని వివరించాడు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ పరుగులు ఇచ్చే షాట్లనే ఎంచుకుంటారని తెలిపాడు. అలాంటి ఆటతీరు జట్టుకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.