17 గంటల కష్టం.. అమ్మమ్మ జ్ఞాపకమే స్ఫూర్తి.. 'నీట్‌' తొలి ర్యాంకర్

Aryan Gupta Punjab Student Tops NEET UG with 715 Marks and 17 Hours Study
  • నీట్‌లో ఆలిండియా తొలి ర్యాంకు సాధించిన ఆర్యన్‌
  • 720 మార్కులకు గానూ 715 మార్కులు
  • రోజుకు 16-17 గంటల చదివానని వెల్లడి
  • క్యాన్సర్‌పై పోరాటమే తన లక్ష్యమన్న ఆర్యన్‌
  • అమ్మమ్మ మరణంతో తీసుకున్న నిర్ణయం
నీట్ యూజీ-2026 ఫలితాల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. 720 మార్కులకు గానూ 715 మార్కులు సాధించిన ఆర్యన్, ఈ విజయం కోసం రోజుకు 16 నుంచి 17 గంటల పాటు శ్రమించినట్లు తెలిపాడు. కేవలం ర్యాంకు సాధించడమే తన లక్ష్యం కాదని, క్యాన్సర్ మహమ్మారిపై పోరాడటమే తన ధ్యేయమని పేర్కొన్నాడు. చిన్నతనంలో సంభవించిన ఒక కుటుంబ విషాదమే తన జీవితాశయానికి దిశానిర్దేశం చేసిందని వివరించాడు.

ఆర్యన్‌తో పాటు హర్యానాకు చెందిన పన్షుల్ బన్సాల్ సైతం 715 మార్కులు సాధించాడు. అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అమలు చేసిన టై-బ్రేకింగ్ నిబంధనల ప్రకారం ఆర్యన్‌కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన ఆర్యన్‌కు చిన్నతనం నుంచే ఆ వృత్తిపై మక్కువ ఏర్పడింది. ఆయన తండ్రి అనస్థీషియాలజిస్ట్ కాగా, తల్లి గైనకాలజిస్ట్. ఆర్యన్ సోదరుడు కూడా గతేడాది నీట్ పరీక్షలో 54వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నారు.

నీట్ పరీక్ష కోసం తన సమయాన్ని పూర్తిగా చదువుకే అంకితం చేశానని ఆర్యన్ తెలిపాడు. రోజుకు కనీసం 16 నుంచి 17 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కే కేటాయించేవాడినని, కొన్ని రోజులు సరైన నిద్ర కూడా ఉండేది కాదని గుర్తు చేసుకున్నాడు. ఈ విజయం ప్రస్తుతం ఒక కలలా అనిపిస్తున్నప్పటికీ, తన నిరంతర శ్రమకు తగిన ఫలితం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.

తాను ఆంకాలజిస్ట్‌గా మారాలనుకోవడానికి వెనుక బలమైన వ్యక్తిగత కారణం ఉందని ఆర్యన్ వెల్లడించాడు. తాను మూడో తరగతిలో ఉన్నప్పుడు తన అమ్మమ్మ క్యాన్సర్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో అందరూ వైద్యులే ఉన్నప్పటికీ ఆమెను కాపాడలేకపోయామన్న బాధ తనను వెంటాడిందని, అప్పుడే క్యాన్సర్ వైద్యుడిగా మారి ఆ వ్యాధిపై పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

నీట్‌లో అగ్రస్థానం సాధించడం ద్వారా తన ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఆర్యన్ అభిప్రాయపడ్డాడు. మెడికల్ కాలేజీలో చేరిన తర్వాతే తన అసలైన లక్ష్యం వైపు అడుగులు పడతాయని పేర్కొన్నాడు. క్యాన్సర్ చికిత్స రంగంలో విశేష సేవలు అందించడమే తన కల అని మరోసారి స్పష్టం చేశాడు. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచి, క్రమశిక్షణతో చదవాలని ఈ సందర్భంగా సూచించాడు.

ఆర్యన్ పోటీ పరీక్షల ప్రయాణం ఆరో తరగతి నుంచే ప్రారంభమైంది. 2019లో ఒక స్కాలర్‌షిప్ పరీక్షలో ఉత్తమ ఫలితం సాధించిన తర్వాత నీట్‌పై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపాడు. కాగా, ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అర్హత సాధించారు. మొత్తం 19 మంది విద్యార్థులు 700 కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 138 మంది విద్యార్థులు 690కి పైగా మార్కులు సాధించడం గమనార్హం. 
Advertisement
Aryan Gupta
NEET UG Topper
NEET AIR 1
Punjab NEET Result
Oncology Aspirant
Medical Entrance Exam

More Telugu News