ఫిఫా ప్రపంచకప్‌-2026 విజేత జట్టుకు ఈసారి సరికొత్త గౌరవం దక్కనుంది. ప్రపంచకప్‌ చరిత్రలోనే తొలిసారిగా ఛాంపియన్‌ జట్టుకు ట్రోఫీ, స్వర్ణ పతకాలతో పాటు ప్రత్యేక ‘ఛాంపియన్‌షిప్‌ రింగ్స్‌’ అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అమెరికా క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రవేశపెడుతున్నారు.

ఫైనల్‌ ముగిసిన వెంటనే విజేత జట్టు కెప్టెన్‌, ప్రధాన కోచ్‌కు తాత్కాలిక రింగ్స్‌ను అందజేస్తారు. అనంతరం జట్టు సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 30 రింగ్స్‌ను అధికారికంగా బహూకరిస్తారు. ప్రతి రింగ్‌పై ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ చిత్రంతో పాటు విజేత జట్టు ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక డిజైన్‌ ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి ఉంగరానికి ఒక ప్రత్యేక నంబర్‌, ప్రామాణికతను ధ్రువీకరించే సర్టిఫికెట్‌ను కూడా అందిస్తారు. 

మొత్తం 2,026 రింగ్స్‌ను మాత్రమే తయారు చేయనున్నారు. వీటిలో 30 రింగ్స్‌ను విజేత జట్టుకు కేటాయిస్తారు. మిగిలిన 1,996 రింగ్స్‌ను అధికారిక లైసెన్స్‌డ్‌ ఉత్పత్తులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇలా అభిమానులు కూడా ప్రపంచకప్‌ అరుదైన జ్ఞాపకాన్ని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఫిఫా తెలిపింది.

కాగా, 2026 ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో యూరప్‌ ఛాంపియన్‌ స్పెయిన్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా తలపడనున్నాయి. సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి స్పెయిన్‌ ఫైనల్‌కు చేరగా, అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.