ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు 'ఈటీవీ' మొదటి నుంచి పట్టం గడుతూనే వస్తోంది. బంధాలు .. అనుబంధాలు .. కుటుంబ నేపథ్యంలో సాగే కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. అలా తాజాగా 'ఈటీవీ విన్' ఓటీటీలోకి 'మధురాపురి సదన' అనే సినిమా వచ్చింది. నేరుగా ఈటీవీ విన్ కి వచ్చిన ఈ సినిమా, ఈ గురువారం (జులై 16) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భరత్ సాయినాథ్ వర్మ - యషు మాశెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి, సాయి తరుణ్ దర్శకత్వం వహించాడు.
హైదరాబాదులో వాసు ( శ్రీనివాస్ భోగిరెడ్డి) ఓ ప్రభుత్వ ఉద్యోగి. పదవీ విరమణకి దగ్గరలో ఉంటాడు. కూతురు అమెరికాలో స్థిరడుతుంది. భార్య పద్మ .. కొడుకు కృష్ణ (భరత్ సాయినాథ్ రెడ్డి)తో కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కృష్ణ కూడా 'అమెరికా' వెళ్లి అక్కడ జాబ్ చేసుకోవాలనేది వాసు కోరిక. కానీ కృష్ణకి సినిమా దర్శకుడిగా మారాలనేది ఆశయం. అందువలన ఆ దిశగానే అతను అడుగులు వేస్తుంటాడు. ఈ విషయంలో తండ్రికి చాలా అసంతృప్తి ఉంటుంది.
ఇక కృష్ణ తన కాలనీలోని అదితి (యషు మాశెట్టి)ని ప్రేమిస్తాడు. అయితే అతను విదేశాలకు వెళ్లి అక్కడ జాబ్ సంపాదించాలనేదే ఆమె కోరిక. తన గోల్ వేరే ఉందనీ, ఆ దిశగా తన కెరియర్ ముందుకు వెళుతుందని అతను తేల్చి చెబుతాడు. ఇక కృష్ణ తల్లికి మాత్రం తమకి సొంత ఇల్లు లేదనే ఒక అసంతృప్తి ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుందని భావిస్తుంది. ఈ విషయం తెలిసి అమెరికా నుంచి కూతురు కొంత డబ్బు పంపిస్తుంది.
ఇంటికి సంబంధించిన పనులు చకచకా మొదలైపోతాయి. అయితే కొంతవరకూ జరిగిన తరువాత పనులు ఆగిపోతాయి. ఇక అక్కడి నుంచి ఆ ఇల్లు పూర్తిచేయడం వాళ్లకి ఓ సవాలుగా మారుతుంది. వాసు సేవింగ్స్ తో ఆ పని చేద్దామని కృష్ణ అనుకుంటే, అతను ఆ డబ్బును బావమరిదికి ఇచ్చి మోసపోయాడని కొడుకు తెలుసుకుంటాడు. అప్పటికే ఇంటి కాగితాలు వేరొకరి దగ్గర కృష్ణ తాకట్టు పెట్టాడని వాసుకి తెలుస్తుంది. పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
జీవితంలో చాలామందికి ఒక ఆశయం ఉంటుంది. అయితే ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. కన్నవాళ్ల కోసమో .. కాబోయే భార్య కోసమో .. ఫ్యామిలీ పరిస్థితుల కారణంగానో తమ ఆశయాన్ని పక్కన పెట్టవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురైనా, వాటిని ఎదుర్కుంటూ ముందుకు వెళ్లిన ఒక యువకుడి కథనే ఇది.
ఎదిగిన పిల్లలు కెరియర్ ను ఎంచుకునే విషయంలో ఎక్కడ పొరపాటు చేస్తారోనని పేరెంట్స్ కి భయం ఉంటుంది. అలాగే ఆర్ధిక పరమైన భద్రత లేని కెరియర్ కారణంగా ఇబ్బందులలో పడతావేమోననే కంగారు పార్ట్నర్ గా వచ్చే వాళ్లకు ఉంటుంది. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రం తమ స్నేహితుడు తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాడు అనే ఒక నమ్మకం బలంగా ఉంటుంది. ఆ పాయింట్ నే దర్శకుడు ఈ కథలో హైలైట్ చేస్తూ వెళ్లాడు.
కుటుంబంలో ఏ నిర్ణయమైనా సరే అందరూ ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది. ఎవరికి వారుగా .. ఒకరిని సంప్రదించకుండా మరొకరు నిర్ణయాలు తీసేసుకుంటే, ఆ ఫ్యామిలీ ప్రమాదంలో పడుతుంది. అదే విషయాన్ని దర్శకుడు ఈ కథలో ఆవిష్కరించిన తీరు ఆలోచింపజేస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలబడాల్సిన అవసరాన్ని గురించి చర్చిస్తుంది.
స్నేహం .. ప్రేమ .. ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన ఈ కథలో, లవ్ - రొమాన్స్ పాళ్లు తగ్గాయనే చెప్పాలి. లవ్ ట్రాక్ ను ఏ మాత్రం డీప్ గా టచ్ చేయకుండా పైపైన తేల్చేశారు. హీరో - హీరోయిన్ పరిచయం జరిగిన తీరు కూడా చాలా ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. కామెడీకి సంబంధించి బలమైన సన్నివేశాలను రాసుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి మాత్రం బాగానే వర్కౌట్ అయింది.
కృష్ణ దర్శకుడిగా మారడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా కొన్ని షాట్స్ పడాల్సింది. అతను ఏ ప్రయత్నాలు చేయకపోవడం .. అయినా అతనిపై ఫ్రెండ్స్ అపారమైన నమ్మకాన్ని పెట్టుకోవడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఇల్లు కట్టడం కోసం హీరో ఫ్యామిలీ రంగంలోకి దిగడం .. అది సమస్యల్లోకి నెట్టడం వంటి సన్నివేశాలకు అనవసరంగా ఎక్కువ సమయం కేటాయించారేమో అనిపిస్తుంది. ఇక హీరో తండ్రిని బావమరిది మోసం చేసే ఎపిసోడ్ కి కూడా అంత లెంగ్త్ అవసరం లేదనిపిస్తుంది.
భరత్ నటనపై మరింత ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. హీరోయిన్ నటన గురించి ఆడియన్స్ తెలుసుకునేంత సమయం ఇవ్వలేదు. హీరో ఫ్రెండ్స్ గా కనిపించిన కమెడియన్స్ బాగానే చేశారు. కాకపోతే కామెడీ ట్రాక్ లోనే బలం లేదు. శ్రీనివాస్ భోగిరెడ్డితో పాటు మిగతావాళ్లు బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
'మధురాపురి సదన' అనే టైటిల్ చూడగానే, ఫీల్ తో కూడిన ఒక అందమైన ప్రేమకథా చిత్రమనే చాలామంది అనుకుంటారు. కానీ సొంత ఇంటి కోసం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టమే ఈ కథ. అందువలన ఈ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తన డ్రీమ్ ను నిజం చేసుకుంటూ, తన పేరెంట్స్ కలను నిజం చేయడానికి నిలబడిన ఒక మిడిల్ క్లాస్ యువకుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, ఓ మాదిరి కేటగిరిలో నిలిచిపోతుందంతే.
'మధురాపురి సదన' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Madhurapuri Sadana Review
Movie Details
Movie Name: Madhurapuri Sadana
Release Date: 2026-07-16
Cast: Bharath Sainath, Yashu Mashetty, Srinivas Bhogireddy, Vaishnavi
Director: Sai Tarun Reddy
Music: Vishnu Vihari
Banner: Bharath Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer