క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తన అసాధారణ ఆటతీరుతోనే కాదు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితోనూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తాడు. తాజాగా తన దినచర్యకు సంబంధించిన ఒక చిన్న, ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను ఉదయం లేవగానే తాగే గ్రీన్ టీని ఎన్నో ఏళ్లుగా స్వయంగా తయారు చేసుకుంటున్నానని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో, వేడి నీళ్ల కెటిల్ నుంచి కప్పులో నీళ్లు పోసి, టీ బ్యాగ్‌తో సచిన్ గ్రీన్ టీ తయారు చేసుకోవడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ప్రతి ఉదయం నా టీ నేనే తయారు చేసుకుంటాను. నేను ఆడే రోజుల్లో కూడా ఇదే అలవాటు. నా గదిలో నేనే టీ పెట్టుకునేవాడిని. ఎవరైనా వచ్చి 'సర్, మీ టీ రెడీ' అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నా పనులు నేనే చేసుకోవడం నాకు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది" అని సచిన్ వివరించాడు. ముఖ్యంగా మ్యాచ్‌కు ముందు తన గదిలోకి ఎవరూ రావొద్దని కోరుకునేవాడినని తెలిపాడు.

ఈ పోస్ట్‌కు, "చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నా ఎన్నో ఇన్నింగ్స్‌లలో ఈ కప్పు టీ కూడా భాగమైంది" అని సచిన్ ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేశాడు. ఈ చిన్న అలవాటు వెనుక ఉన్న ఏకాగ్రత, మానసిక ప్రశాంతతే సచిన్ ను 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించేలా చేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.