పనికిరాని నిబంధనలు రద్దు చేయండి!: ఆర్టీజీఎస్ సమీక్షలో చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Abolish useless rules CM directions in RTGS review
  • పాతకాలపు బిజినెస్ రూల్స్‌లో సంస్కరణలకు సీఎం ఆదేశం
  • ఫిర్యాదుల స్వీకరణకు క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని అమలు చేయాలి
  • 21 ప్రముఖ దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని సూచన
  • ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో అభివృద్ధి పనులను ఆలస్యం చేయవద్దు
  • 22ఏ భూ వివాదాలను పరిష్కరించి అవకాశాలు సృష్టించాలని దిశానిర్దేశం
ప్రభుత్వ పాలనలో వేగం పెంచేందుకు, అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో అభివృద్ధి ఆలస్యం కాకూడదని స్పష్టం చేసిన ఆయన, అవసరం లేని, పాతబడిపోయిన 'బిజినెస్ రూల్స్'ను సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిబంధనలను సరళతరం చేయాలని నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీఎస్) కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అందించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. ఉన్నతాధికారులు సరైన నాయకత్వంతో పనిచేస్తేనే ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు చేరతాయని స్పష్టం చేశారు. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ పాలనలో పారదర్శకత తీసుకురావాలని సూచించారు. 2017తో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) 20 శాతం వృద్ధి సాధించిందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలన్నారు.

దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా మార్చాలి

దేవాదాయ శాఖపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలను గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ ఆలయాల పరిసరాల్లో ఆర్థిక, పర్యాటక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. 

అదేవిధంగా, ఆర్టీసీ బస్సులు సరైన సమయానికి నడిచేలా చూడాలని, బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అగ్నిమాపక శాఖ సేవల ప్రమాణాలను పెంచాలని, రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా రైతులకు భరోసా ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారానికి క్రౌడ్ సోర్సింగ్

ప్రభుత్వానికి వచ్చే అన్ని ఫిర్యాదుల స్వీకరణకు 'క్రౌడ్ సోర్సింగ్' విధానాన్ని అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి అర్జీని మానవీయ కోణంలో పరిశీలించి, వేగంగా పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో కొందరి భూములను 22ఏ జాబితాలో చేర్చారని, ఇలాంటి వివాదాలను పరిష్కరించడం ద్వారా ఎన్నో అవకాశాలను సృష్టించవచ్చని తెలిపారు. 

శెట్టిపల్లి భూ వివాదం పరిష్కారంతో ప్రభుత్వానికి రూ.900 కోట్ల విలువైన భూమి రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర వర్చువల్‌గా పాల్గొనగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సమీక్ష అనంతరం, ఆర్టీజీఎస్ రూపొందించిన 'గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్' మాసపత్రికను సీఎం ఆవిష్కరించారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Governance
RTGS Review
Business Rules Reform
AP Temples Growth Centers
Crowdsourcing Grievance Redressal

More Telugu News